తన ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలుస్తోందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా నిమగ్నమయ్యారు. మిగిలిన కార్యకలాపాల గురించి పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో తన ప్రభుత్వంపై జనాభిప్రాయం ఏంటనేది జగన్ తెలుసుకుంటే మంచిది.
తాజాగా కర్నూల్ కార్పొరేషన్‌లో సొంత పార్టీ కార్పొరేటర్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ప్రభుత్వానికి ఓ హెచ్చరికగా భావించొచ్చు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నిధుల కొరతతో కనీసం చిన్నపాటి రోడ్డు వేసే పరిస్థితులు కూడా లేవు. ఇదే విషయాన్ని వైసీపీ కార్పొరేటర్లే సభాముఖంగా ఆందోళనకు దిగి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.
కర్నూలు కార్పొరేషన్‌లో కనీసం ఒక్క పనీ జరగడం లేదని, ప్రజలకు ముఖం చూపలేకపోతున్నామని, వీధుల్లో ఎలా తిరగాలని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఇందుకు వేదికైంది. వైసీపీకి చెందిన 43వ డివిజన్ కార్పొరేటర్ మునెమ్మ కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
తన డివిజన్‌కు ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను మేయర్ బీవై రామయ్యతో పాటు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్ నచ్చ చెప్పి ఆందోళన విరమింపజేయాల్సి వచ్చింది. 41వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్ శ్వేత మాట్లాడుతూ చిన్నచిన్న సమస్యలూ పరిష్కారం కాలేదన్నారు. దీంతో డివిజన్‌లో తిరగలేకున్నామని, జనం నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటివి కేవలం కర్నూలు కార్పొరేషన్‌కే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకుంది. తాజాగా కర్నూలు కార్పొరేషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. రేపు తిరుపతి, ఆ తర్వాత కడప…ఇలా అన్ని చోట్ల నిరసనలు వ్యక్తం చేసే రోజులు దగ్గరపడ్డాయి. ఎందుకంటే నిధుల లేమితో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలు ఆలోచించరు.
ఎందుకంటే సంక్షేమ పథకాలకు అడ్డురాని ఆర్థిక లేమి, సౌకర్యాల కల్పనకు ఎలా అడ్డొస్తోందనే ప్రశ్నలు ఇప్పటికే బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని జగన్ సరిదిద్దుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో కష్టకాలమే అని హెచ్చరించాల్సి వస్తుంది.