సోము వీర్రాజు ఎంట్రీ బాగానే ఉన్నా ఎగ్జిట్ మాత్రం హుందాగా కనిపించడం లేదు. చీప్ లిక్కర్ వ్యవహారంతో సోము కెరీర్ ముగిసిపోతుందని అంటున్నారు. ఫిఫ్టీ రూపీస్ కే చీప్ లిక్కర్ అంటూ ఉదారంగా హామీ ఇచ్చిన సోముపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోందట. మరోవైపు కేటీఆర్ పేల్చిన సెటైర్ కూడా అదిరిపోయింది. వాట్ ఎ స్కీమ్.. వాట్ ఎ షేమ్ అంటూ కేటీఆర్ పేల్చిన పంచ్ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది.
వాస్తవానికి ఏపీ వైసీపీ నుంచి కూడా ఆ స్థాయిలో సోముపై సెటైర్ పేలలేదు. అయితే కేటీఆర్ లెక్క వేరు. తెలంగాణలో బీజేపీతో టీఆర్ఎస్ పోరాడాల్సిన పరిస్థితి. దీంతో దేశవ్యాప్తంగా మీ స్కీమ్ ఇదేనా అంటూ టోటల్ గా బీజేపీని టార్గెట్ చేశారు కేటీఆర్. దీంతో అధిష్టానం కూడా సోము వీర్రాజు వ్యాఖ్యలతో డైలమాలో పడింది.
బీజేపీ, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కొన్నిచోట్ల మద్యనిషేధం అమలులో ఉంది. ఈ దశలో చీప్ లిక్కర్ ని చీప్ గా ఇస్తాం మాకు ఓట్లేయండి అంటూ అదే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రకటించడం సమంజసమేనా..? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. దీంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సోము వీర్రాజు వివరణ అడిగింది.
ప్రెస్ మీట్ అందుకేనా..?
చీప్ లిక్కర్ పై కౌంటర్లు పడ్డాక సోము వీర్రాజు మరో ప్రెస్ మీట్ పెట్టి విరుచుకుపడ్డారు. బీజేపీని విమర్శించే స్థాయి ఎవరికీ లేదన్నారు. అధిష్టానం తలంటడం వల్లే వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగేలా లేదు. ఒకవేళ సోముని పదవి నుంచి తొలిగిస్తే.. దానికి ఇదే ప్రధాన కారణం అయ్యేలా ఉంది.
ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవిలో మార్పు..
కన్నా లక్ష్మీ నారాయణ తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన వీర్రాజు.. వచ్చీ రాగానే చిరంజీవి, పవన్ కల్యాణ్ కి బొకేలిచ్చి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. టీవీ చర్చల్లో పాల్గొంటూ టీడీపీపై విమర్శలు చేసి మరింత పాపులార్టీ సాధించారు. ఆ తర్వాత షరా మామూలే. ఏం జరిగిందో ఏమో కానీ టీడీపీపై ఆ స్థాయిలో కోపం ప్రదర్శించడంలేదు. తీరా ఇప్పుడు ఇలా నోరు జారడం, చీప్ లిక్కర్ పై చీప్ వ్యాఖ్యలు చేయడం వరకు దిగజారిపోయారు వీర్రాజు.
ఏపీలో పార్టీని ఉద్ధరిస్తారనుకుంటే.. తన కామెంట్లతో మరింత పరువు తీసేశారు వీర్రాజు. దీంతో అధిష్టానం అధ్యక్ష పదవిలో మార్పుకోసం ప్రయత్నిస్తోందట. గతంలోనే ఈ ప్రతిపాదన ఉన్నా కూడా.. ఇప్పుడు చీప్ లిక్కర్ స్టేట్ మెంట్ తో వీర్రాజుకి చెక్ పెట్టబోతున్నారట. కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో ఏపీలో ఎన్నికల రణరంగాన్ని ఎదుర్కోవాలని బీజేపీ ఆలోచిస్తోంది.