నారా కాషాయం నడుమ జనసేనాని పవన్‌కల్యాణ్ ఇరుక్కున్నారు. రెండు పార్టీలకు జనసేన కావాలి. అయితే జనసేనాని మనసులో ఏముందో అంతు చిక్కడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రతిపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకమయ్యాయి. ఎలాగైనా జగన్‌ను అధికారం నుంచి దింపితే తప్ప తమకు మనుగడ లేదని టీడీపీ, జనసేన, బీజేపీ భావిస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ భవిష్యత్‌పై రానున్న ఎన్నికలు ఆధారపడి వున్నాయి. విజయం సాధిస్తే తప్ప టీడీపీకి భవిష్యత్ వుండదనే ప్రచారం జరుగుతున్న దృష్ట్యా చంద్రబాబులో కలవరం మొదలైంది.
తన వయసు పైబడుతుండడం, లోకేశ్ నాయకత్వానికి ఆదరణ లేకపోవడం చంద్రబాబుకు నిద్ర పట్టనివ్వడం లేదు. పైగా తాను ఒంటరిగా జగన్‌ను ఎదుర్కోలేననే నిర్ణయానికి ఆయన వచ్చారు. దీంతో జనసేనతో పొత్తు కుదుర్చుకోవాలని బాబు తహతహ లాడుతున్నారు. మరోవైపు బీజేపీతో జనసేనాని పొత్తులో ఉన్నారు. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబును దగ్గరికి తీసుకునేందుకు బీజేపీ సుముఖంగా లేదు. కానీ 2014లో మాదిరిగా టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తే తప్ప జగన్‌ను ఓడించడం కష్టమని పవన్‌కల్యాణ్ ఆలోచనగా చెబుతున్నారు. బీజేపీకి టీడీపీని దగ్గర చేసేందుకు పవన్‌కల్యాణ్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రయత్నాలకు సానుకూల స్పందన రాకపోవడంతో పవన్ నిరాశకు గురి అయ్యారనే సమాచారం.
ఈ నేపథ్యంలో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ రానున్న ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఓ పథకం ప్రకారం జనసేనతో పొత్తుపై టీడీపీ ముఖ్య నాయకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం టీడీపీలో జోష్ నింపుతుండగా, జనసేనను బలహీనపరుస్తోంది. టీడీపీపై పవన్ అభిప్రాయం ఏంటనే సంగతి పక్కన పెడితే, జనసైనికులు మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ, టీడీపీలకు సమాన దూరంలో వుంటూ సొంతంగా ఎదగాలనేది జనసైనికుల అభిప్రాయం.
చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి తామెందుకు మరోసారి బోయీలు మోయాలనేది జనసేన శ్రేణుల ప్రశ్న. టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటే బాబే ముఖ్యమంత్రి అవుతారని, దీని వల్ల మనకొచ్చే ప్రయోజనం ఏంటనేది జనసేన నాయకుల ఆవేదన. ఇలాగైతే ఎప్పటికీ తమను జనాలు నమ్మరని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కానీ జనసేనతో కలిసి పోటీ చేస్తామని టీడీపీ మరింత దూకుడుగా ప్రచారం చేయడానికి నిర్ణయించుకుంది.
జనసేన అభిప్రాయంతో సంబంధం లేకుండానే టీడీపీ ఆ పని చేస్తుండడం గమనార్హం. ఒకవేళ తమ ప్రచారం నిజమైతే ఒక లాభం, లేకపోతే రెండు లాభాలు అన్నట్టుగా వుంది టీడీపీ వైఖరి. జనసేనను బలహీనపరచడం వల్ల కూడా తమ వైపు కాపులను తిప్పుకోవచ్చనేది టీడీపీ ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీకి తన ప్రయోజనాలే తప్ప, ఎదుటి వాళ్ల లాభనష్టాలతో సంబంధం లేదు. తనకు నష్టం కలిగించే ప్రచారంపై జనసేన ఆలోచించాల్సి వుంది. కొవ్వొత్తిలా కరిగిపోతూ టీడీపీకి వెలుగు ఇవ్వడానికి జనసేన సిద్ధపడితే ఎవరూ ఏమీ చేయలేరు.