బాబు దాచిన సీక్రెట్ బయటకు వచ్చేసింది

తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్య అక్రమ సంబంధం ఉన్నదనేది అందరికీ తెలిసిన సంగతి! కాకపోతే.. ఆ బంధాన్ని ఎవ్వరూ గుర్తించలేదు అన్నట్టుగా ఆ రెండు పార్టీలు కూడా గుంభనంగా, గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరిస్తూ ఉంటాయి.…

తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్య అక్రమ సంబంధం ఉన్నదనేది అందరికీ తెలిసిన సంగతి! కాకపోతే.. ఆ బంధాన్ని ఎవ్వరూ గుర్తించలేదు అన్నట్టుగా ఆ రెండు పార్టీలు కూడా గుంభనంగా, గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరిస్తూ ఉంటాయి. తనను ఎవ్వరూ చూడడం లేదని అనుకుంటూ.. కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా వీరిద్దరి వ్యవహారం ఉంటుంది. 

లోలోపల ఒకరి ప్రయోజనాల కోసం ఒకరు పనిచేస్తున్నరానేది జనం గుర్తిస్తూనే ఉన్నారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని చంద్రబాబునాయుడు చాన్నాళ్లుగా దాచి ఉంచుతున్నారు గానీ.. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దాన్ని బయటపెట్టేశారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఒక్కటే లక్ష్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు కలిసి పోటీచేస్తాయని సాక్షాత్తూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు మహ్మద్ అహ్మద్ షరీఫ్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత విధాని నిర్ణాయక వ్యవస్థ అయిన పాలిట్ బ్యూరోలో ఆయన సభ్యుడు. 

ఆయన మాటను తేలికగా తీసిపారేయడానికి వీల్లేదు. పైగా.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అధికార వికేంద్రీకరణ చేపట్టి.. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ తీసుకువచ్చిన బిల్లు.. అసెంబ్లీలోనే ఆగిపోయేలా.. శాసనమండలిలో మోకాలడ్డిన అప్పటి మండలి ఛైర్మన్ ఆయనే. అంతటి కీలక నాయకుడు చెబుతున్న మాటలను ఎలా తోసిపుచ్చగలం. 

అందుకే.. తెలుగుదేశం జనసేన అక్రమ సంబంధం ఇక బయటపడిపోయినట్టే అని అందరూ అనుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గద్దెపై కూర్చోబెట్టడానికి, జగన్ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోడానికి తన సర్వశక్తులు ఒడ్డి పనిచేసిన పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల నాటికి వారితో వైరం పెంచుకున్నట్టుగా ఒక డ్రామా నడిపించారు. ఆ తరువాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టుగా ప్రకటించారు గానీ, వారి మధ్య పొత్తు బంధం సరిగా పొడవలేదు. ఏ సందర్భంలో అయినా ఎవరికి వారే అన్న తీరుగానే వ్యవహరిస్తుంటారు. అప్పుడప్పుడూ చంద్రబాబు అనుకూల ప్రకటనల ద్వారా కూడా పవన్ కల్యాణ్ తమ బంధం గురించి సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. 

నిజానికి వచ్చే ఎన్నికల నాటికి జనసేన-బీజేపీ కూటమి వచ్చి తెలుగుదేశంతో కలుస్తుందనే అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది. అయితే మండలి మాజీ ఛైర్మన్ అహ్మద్ షరీఫ్ కొత్త సమీకరణాన్ని బయటపెట్టారు. తెలుగుదేశం- జనసేన- వామపక్షాలు కలిసి బరిలో ఉంటాయని అంటున్నారు. బిజెపితో జట్టుకట్టడం ఆయనకు ఇష్టం లేదో.. ఎటూ బీజేపీ ప్రభావం రాష్ట్రంలో పెద్దగా లేదు గనుక.. వారిని విడిచిపెట్టేసి అంతో ఇంతో బలమున్న వామపక్షాలతో కలిసి ఊరేగడమే బెటరని.. చంద్రబాబునాయుడు పాలిట్ బ్యూరో మీటింగుల్లో సంకేతాలు ఇచ్చారో తెలియదు. కానీ.. పార్టీలో అంతటి కీలక పదవిలో ఉన్న షరీఫ్ చేసిన వ్యాఖ్యలు పరిగణించదగినవిగానే ఉన్నాయి. 

ఇక ముసుగు తొలగించేసి.. చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసే కార్యక్రమాలు నిర్వహించుకుంటూ.. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఒక్కటే తమ లక్ష్యమని, విడివిడిగా అది తమకు చేతకాదని ఒప్పుకుంటే సరిపోతుందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.