ఆ మాట చెప్పాలంటే పవన్ కల్యాణ్‌కు భయమా?

సోము వీర్రాజు మాటలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారంగానే మారుతున్నాయి. ఈ ఒక్క మాట బీజేపీ పతనాన్ని శాసిస్తుందేమోననే ప్రచారం కూడా జరుగుతోంది. నష్టనివారణ ఎలా అనే విషయంలో ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు…

సోము వీర్రాజు మాటలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారంగానే మారుతున్నాయి. ఈ ఒక్క మాట బీజేపీ పతనాన్ని శాసిస్తుందేమోననే ప్రచారం కూడా జరుగుతోంది. నష్టనివారణ ఎలా అనే విషయంలో ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని.. వారికి ఉండగల ప్రజాదరణను తాను కూడా సొమ్ము చేసుకుంటూ.. రాజకీయంగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ సైలెంట్ గా ఉండడం చిత్రంగా ఉంది. 

తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను 50కే అందిస్తాననే సోము వీర్రాజు మాటలపై దేశంలోని నాయకులందరూ స్పందిస్తున్నారు. అయితే.. బీజేపీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే.. ఇప్పుడున్న బంధం ప్రకారం.. ఆ అధికారంలో తానుకూడా భాగస్వామిగా ఉండే చాన్స్ ఉన్న పవన్ కల్యాణ్ మాత్రం.. నోరు మెదపడం లేదు ఎందుకు?

పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఫ్రాన్స్ యాత్రలో కుటుంబంతో కలిసి సరదాగా విహరిస్తూ ఉండవచ్చు గాక. కానీ రాష్ట్ర పరిణామాలపై, రాష్ట్రం అట్టుడికిపోతున్న ఒక అంశంపై చిన్న కామెంట్, ట్వీట్ చేయడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా ఉన్నారా? లేదా.. ఈ వివాదంలో తలదూరిస్తే.. తన తలే బొప్పి కడుతుందని భయపడుతున్నారా?

నిజానికి ఆయన దేశంలో లేకపోవడం వల్ల స్పందించడం లేదని ఎవరైనా అనుకుంటే పొరబాటు. ఎందుకంటే.. ఆయన దేశంలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదు. ఆయన జూబ్లీ హిల్స్ ఇంటిలో ఉన్నా, షూటింగ్ లొకేషన్లో ఉన్నా.. ఆయన తరఫునుంచి స్కాన్ చేసిన సంతకంతో ఒక ప్రెస్ రిలీజ్ వస్తుంది తప్ప.. మరొకటి కాదు. ఆ భాగ్యానికి ఆయన విదేశాల్లో ఉంటే మాత్రం ఏమైంది. 

రాష్ట్రమంతా మాట్లాడుకుంటున్న ఒక అంశం గురించి.. అధికారంలోకి తానే రావాలని కలగంటున్న ఒక నాయకుడు మౌనం పాటించడం కరక్టేనా? అనేది పెద్ద ప్రశ్న. లేదా.. పవన్ కల్యాణ్ కూడా సోము వీర్రాజు మాటలకు జై కొట్టేలా.. చీప్ లిక్కర్ అత్యంత చీప్ గా అందిస్తాం అనే ఆఫర్ ద్వారా మాత్రమే.. తాము 2024 లో అధికారంలోకి రాగలం అనే నమ్మకంతో ఉన్నారేమో తెలియదు. 

నిజానికి పవన్ కల్యాణ్ సహజలక్షణం ప్రకారం.. ఆయన ఈ మాటలను ఖండించాలి. ఆయన పాటించే, ప్రవచించే సిద్ధాంతాల ప్రకారం అయితే.. ఇలా చీప్ లిక్కర్ ఆఫర్ ద్వారానే బీజేపీ ఎన్నికలకు వెళ్లేట్లయితే.. మేం ఆ పార్టీతో పొత్తు తెగతెంపులు చేసుకుంటాం అనే ప్రకటన రావాలి. ఆయన తరహా అలా ఉంటుంది. కానీ పవన్ తరఫు నుంచి గానీ, ఆయన పార్టీ వారినుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. 

బీజేపీ తో తెగతెంపులు చేసుకోవడానికి పవన్ కల్యాణ్ భయపడుతున్నారా? వారు ఇంత దారుణమైన ప్రకటనతో, అదే తమ విధానం అన్నట్లుగా సమర్థించుకుంటూ ఉంటే.. వారితో పొత్తు పెట్టుకున్న.. వారితో భావసారూప్యత వల్లనే కలసి అడుగులు వేస్తున్నానని ప్రకటించిన పవన్ కల్యాణ్ మౌనంగా ఉంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. మౌనంగా ఉంటే.. పవన్ కల్యాణ్ కూడా సోము వీర్రాజు వాదనను బలపరచినట్లే అవుతుందని అంతా అనుకుంటున్నారు.