వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఇన్నాళ్ళూ విపక్షాల విమర్శలను తేలికగా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచే షాక్ కొట్టింది. అది కూడా న్యూ ఇయర్ కి రెండు రోజుల ముందు. ఒక విధంగా ఇది ఎమ్మెల్యే పని తీరు మీద వెళ్లగక్కిన అసంతృప్తి బాంబుగా చూడాలని అంటున్నారు.
విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన ఎమ్మెల్యే గొల్లబాబూరావు పైన సొంత పార్టీ నేతలే ద్వజమెత్తారు. వారంతా ఆయన్ని మూడు సార్లు కష్టపడి గెలిపిస్తే ఈ రోజు ఆయన టీడీపీ, జనసేన వంటి ఇతర పార్టీల వారిని అక్కున చేర్చుకుని తమను దూరం పెడుతున్నారని వారు మండిపోయారు.
వీరంతా కలసి పాయకరావుపేటలోని బంగారమ్మపాలెంలో తాజాగా సమావేశమై ఎమ్మెల్యే తీరు మీద విరుచుపడినట్లుగా సమాచారం. ఇందులో వైసీపీకి చెందిన ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా కీలక నేతలు, మాజీ సర్పంచులు కూడా ఉన్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే అయ్యాక బాబూరావు తమను అసలు పట్టించుకోవడంలేదని, అన్ని విధాలుగా ప్రతిపక్ష నేతలకే సహకరిస్తున్నారని వారు వాపోయారని సమాచారం. ఎంపీటీసీ బొలిశెట్టి గోవింద్ అయితే ఏకంగా ఎమ్మెల్యే మీద గట్టిగానే విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే తీరుతో పార్టీ దారుణంగా నష్టపోతోందని వారు వాపోయారు.
తాము ఎమ్మెల్యే కోసం అన్ని రకాలుగా పనిచేసి ఆర్ధికంగా నష్టపోయామని కూడా బోలిశెట్టి గోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆయన సతీమణి శారదాదేవి అయితే తన భర్త కరోనా బారిన పడినా కూడా ఎమ్మెల్యే బాబూరావు కనీసం పరామర్శించలేదని ఆరోపించారు. ఇపుడు మంత్రి అవుదామని చూస్తున్న ఎమ్మెల్యే పార్టీ కొరకు ఎన్నో ఏళ్ళుగా కష్టపడిన తమకు ఏ పదవీ లేకుండా చేయాలని చూస్తున్నారని, అంతే కాకుండా అసలైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు.
మొత్తానికి గొల్ల బాబూరావు మీద పాయకరావుపేటలో బయటపడిన తొలి తిరుగుబాటుగా దీన్ని భావిస్తున్నారు. మరి ఎమ్మెల్యే దీన్ని ఎదుర్కొంచేందుకు ఎలా చేస్తారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.