దృశ్యం సినిమాను 2014లో థియేటరులో చూసినపుడు అందరి లాగానే నేనూ చాలా థ్రిల్ ఫీలయ్యాను. ఆ కథకు కొనసాగింపు వుంటుందని, తర్వాతి భాగం రాయడం సాధ్యమని కానీ నాకు తోచలేదు. దృశ్యం 2 సినిమా ఈ ఏడాది మలయాళంలో ఒటిటిలో రిలీజైనప్పుడు ఆశ్చర్యపడ్డాను. చాలా బాగా నచ్చింది. ఒక మంచి సమీక్షావ్యాసం కూడా చదివాను. దాని గురించి రాద్దామనుకుని చూడని తెలుగు ప్రేక్షకులకు కథ చెప్పేసినట్లు వుంటుందని ఆగాను. రిలీజై ఒక నెల దాటింది కాబట్టి, ముగింపు గురించి చాలామంది మాట్లాడేస్తున్నారు కాబట్టి యిప్పుడు ధైర్యం చేసి రాస్తున్నాను. దానికి ముందు మలయాళీ చిత్రపరిశ్రమ గురించి కొన్ని ప్రశంసావాక్యాలు పలికి తీరాలి, దానితో బాటు తెలుగు పరిశ్రమ ప్రస్తుత దృశ్యం గురించి కూడా నాలుగు (నాలుగంటే నాలుగే కాదు లెండి) మాటలు.
ఇప్పుడు తెలుగు పరిశ్రమ గురించి బాగోగుల గురించి ఆందోళన చెందుతూ చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి 70% ఆదాయం వచ్చే ఆంధ్ర ప్రాంతాన్ని పాలిస్తున్న ప్రభుత్వం కట్టడి చేయాలని చూస్తోంది కాబట్టి పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఏమౌతాయని ఆదుర్దా కనబరుస్తున్నారు. జగన్‌పై రాజకీయ వ్యతిరేకతతో మాట్లాడితే ఏమీ చెప్పలేం కానీ చాలాకాలంగా తెలుగు పరిశ్రమ తన గోతిని తనే తవ్వుకుంటూ వచ్చిందని నిష్పక్షపాతంగా ఆలోచించే పరిశీలకులు ఒప్పుకుంటారు. నూటికి 90 సినిమాలు ఫ్లాపవుతున్నాయని మెగా స్టారే చెప్పారు. మరి అలాటప్పుడు వందల కోట్ల బజెట్‌తో సినిమాలు తీయవలసిన అవసరం వుందా? ఏడాదికి 8-10 పెద్ద సినిమాలు తీసి, సంవత్సరంలో 50-60 రోజులు మాత్రం థియేటర్లు నిండితే చాలనుకుంటే ఒప్పుతుందా?
పోనీ పెద్ద సినిమాలన్నీ హిట్ అవుతున్నాయా? లేదే! ఎందువలన? కథాబలం సరిపోక, బజెట్ ఎక్కువై పోయి! మలయాళ పరిశ్రమకు యీ అవస్థ వస్తుందా? వాళ్లు కథను నమ్ముకుంటారు. పరిమిత బజెట్‌లోనే సినిమా తీసి ప్రజలను థియేటర్లకు రప్పించుకుని, తమ డబ్బు రాబట్టుకుంటారు. తమ కథలను యితర భాషల్లో అమ్ముకుని లాభాలు సంపాదించుకుంటారు. ఒకసారి కలర్స్ స్వాతి అన్నారు – మలయాళ సినిమాలో హీరోయిన్‌గా వేస్తే వచ్చే పారితోషికం కంటె, హైదరాబాదులో బట్టలషాపు ఓపెనింగుకి వెళితే యిచ్చే బహుమతి ఎక్కువని. తక్కువ జీతం యిచ్చినా కళాకారుల ఫుల్ టాలెంటుని రాబడుతున్నారు కదా! కరోనా కారణంగా థియేటర్లు మూతపడినా, వాళ్లు ఓటిటిలో రిలీజు చేసి తమ పెట్టుబడి రాబట్టుకోగలరు. చాలా తక్కువ సినిమాల విషయంలో తప్ప మనవాళ్లకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే మన సినిమాల ఆదాయమంతా ఓపెనింగుల పైనే ఆధారపడి వుంటుంది.
నిజానికి ఓపెనింగు కలక్షన్లు అనే సిండ్రోమ్ మన తెలుగు సినిమాను పట్టి పీడిస్తోంది. ఫలానా పాత్రకు ఫలానా నటుడు చక్కగా సరిపోతాడు కదండీ అంటే ‘నిజమే కానీ ఓపెనింగ్స్ రావండి’ అంటారు. ‘ఈ నటుడు బాగా చేస్తాడు కదా, ఈ డైరక్టరు గొప్ప సినిమాలు తీశాడు కదా, ఛాన్సెందుకు యివ్వరు?’ అని అడిగితే ‘మార్కెటు లేదండి. టేబుల్ మీద అమ్ముకోవడానికి వీలుపడదు. థియేటర్లో రిలీజు చేసి రెండు వారాలు నడిపించి, డబ్బులు వసూలు చేసుకునే ఓపిక మాకు లేదు. రిలీజుకి ముందే అమ్మేసుకోగలగాలి మనం.’ అంటారు నిర్మాతలు. సినిమాకు కథ నిర్ణయించుకుని, దానికి తగ్గ హీరో ఎవరు అని చూడరు. హీరో డేట్స్ దొరికితే చాలు, ఏదో ఒకటి చుట్టేసి, మసిపూసి మారేడుకాయ చేసి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసి, ప్రేక్షకులను కూడా ఏమారుద్దామని చూస్తున్నారు. ఓ సినిమా అనేది థియేటర్లలో నిలిచి, నాలుగైదు వారాలాడాలి, యింటిల్లిపాదీ వచ్చి చూడాలి అనేది వాళ్ల ప్లాను కానే కాదు.
గతంలో అయితే థియేటర్లు ఉడిపి హోటళ్లలా వుండేవి. ధర తక్కువ, కుటుంబమంతా వెళ్లినా పెద్దగా ఖర్చవదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు థియేటర్లను ఇరానీ హోటళ్లలా మార్చేశాయి. ఫ్యామిలీలు వెళ్లడం మానేశాయి. కుర్రకారు మాత్రమే వెళ్లసాగారు, కానీ రేట్లు తక్కువే కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు మరీ ఘోరమై పోయింది. ఫైవ్ స్టార్ హోటళ్ల రేటు తీసుకుని, బిర్యానీ పెడతామని ఊరించి, ప్లేట్లో ఇడ్లీ పెడుతున్నారు. మా ఉత్పాదనకు మేం ఎంఆర్‌పి నిర్ధారించుకునే హక్కు మాకుంది అనే వాదనకు రిటార్టుగా ఓ వాదన విన్నాను. ‘ఎంఆర్‌పీ చెల్లించి కొన్న వస్తువులో లోపం వుంటే, యింకోటి యిస్తారు, వీలు కాకపోతే డబ్బు వెనక్కి యిస్తారు. మరి సినిమా బాగా లేకపోతే అలా యివ్వగలరా? ’ అని. నిజానికి ఏ కళారూపం విషయంలోనైనా అలాటి గ్యారంటీ యివ్వలేరు. ఈ వ్యాసం మీకు నచ్చుతుందో లేదో, దీనిపై వెచ్చించిన సమయం కిట్టుబాటు అయిందో లేదో చదివేదాకా మీకూ తెలియదు, నాకూ తెలియదు. అదే గాయకుడు చేసిన ఓ కచ్చేరీ బాగుంటుంది, మరొకటి నిరాశ పరుస్తుంది. అదే వంటవాడి ఓ రోజు వంట బాగుంటుంది, మరో రోజు బాగుండదు.
ఇలాటి పరిస్థితుల్లో ఊరించకపోవడం, ముందే డప్పు కొట్టి, రేటు పెంచకపోవడం మంచిది. టీవీలు, ఓటిటి వంటి ప్రత్యామ్నాయాలు వున్న యీ రోజుల్లో ఎవరైనా థియేటరుకు రావాలంటే సాంకేతిక విలువల కోసం రావాలి. బాహుబలి వచ్చినపుడు దశాబ్దాలుగా థియేటరు మొహం చూడనివారు కూడా వచ్చి చూశారట. 100 కోట్ల బజెట్‌తో సినిమా తీశాం అంటే ఆ భారీతనం తెరపై కనబడుతుందేమో అనే ఆశతో ప్రేక్షకుడు వస్తే, ‘అబ్బే, దానిలో 60 కోట్లు హీరోకి, 15 కోట్లు డైరక్టరుకి యిచ్చేయగా పెద్దగా మిగల్లేదు. ఇదిగో యింతే ఖర్చు పెట్టగలిగాం.’ అంటే ఒళ్లు మండిపోదూ! హీరో మీద వీరాభిమానాన్ని పెంచుకున్న పాపానికి మమ్మల్ని యిలా దోచుకుంటారా అనే ఆక్రోశంతో ఓ మాదిరిగా ఆడవలసిన సినిమాను కూడా ఫ్లాప్ చేసి వదులుతున్నారు.
గతంలోనే రాశాను, థియేటరు అనేది సామాజిక అవసరం. సినిమా అనేది సామూహిక స్వప్నం. తన సృష్టిని థియేటరులో చూపించాలనే దర్శకుడు ఆశిస్తాడు. ఆ థియేటరు శుభ్రంగా వుండాలని, సాంకేతికంగా వున్నతంగా వుండాలని ఆశించడం తప్పా? గుణశేఖర్ బోల్డు రిస్కు తీసుకుని ‘‘రుద్రమదేవి’’ సినిమాను త్రిడిలో నిర్మిస్తే ప్రదర్శించగల సామర్థ్యం వున్న థియేటర్లు అతి తక్కువగా తేలాయి. ‘మేం ప్రేక్షకులకు బలవంతం చేయటం లేదు, వాళ్లే వచ్చి నాలుగు రెట్లు పెట్టి టిక్కెట్టు కొంటున్నారు’ అని మొదటి వారాల్లో హెచ్చు రేట్లను నిర్మాతలు సమర్థించు కోవచ్చు. కానీ షోల మీద షోలు వేసేసి, డబ్బు నొల్లేస్తున్నాం అని ఒప్పుకుని తీరాలి. వెయ్యి రూపాయలు పెట్టి చూసిన సినిమా చెత్తదని తేలడంతో తెనాలి రామలింగడి పిల్లిలా ప్రేక్షకుడు ఆ వైపు పోవడం మానేశాడు.
పరిస్థితి చక్కబడాలంటే ఎలా? థియేటర్లకు డిమాండు తగ్గిపోయింది కాబట్టి వాటిని ఆకర్షణీయంగా చేసుకుని, ధర తగ్గించి, జనాలను రప్పించి, టర్నోవరు పెంచుకుంటే థియేటరు వ్యాపారం కూడా కిట్టుబాటు అవుతుంది. ఏడాదిలో కనీసం 9 నెలల పాటు 75% థియేటరు నిండేలా ప్లాన్లు వేయాలి. చూసేదాకా సినిమా ఎలా వుంటుందో తెలియదు కాబట్టి తక్కువ రేటయితే రిస్కు తీసుకుంటాడు. కొత్త హోటల్‌కి వెళ్లినపుడు టెస్ట్ చేయడానికి తక్కువ రేటులో వస్తుంది కదాని ఇడ్లీ తెప్పిస్తాం. అదే థియరీ యిక్కడా వర్తిస్తుంది. రేటు ఎంతవరకు తగ్గించాలి, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు ఏ మేరకు సబబు అనేది నేను చెప్పలేను. నా దగ్గర ఇన్‌పుట్స్ లేవు.
కాస్టింగ్ అనేది ఓ పెద్ద ప్రక్రియ. డిమాండు, సప్లయి, ప్రత్యామ్నాయాలు యిటువంటి అనేక అంశాలను లెక్కలోకి తీసుకుని ధర నిర్ణయించాలి. కొంతకాలం అమలు చేసి చూసి, కుదరకపోతే పెంచడమో, తగ్గించడమో చేయాలి. అనేక కంపెనీలు తమ ఉత్పాదనల విషయంలో యీ ధోరణే అవలంబిస్తాయి. నిజానికి టిక్కెటు రేటు తగ్గించినందుకు థియేటర్ల ఓనర్లకు ప్రభుత్వంపై వచ్చే కోపం వస్తుందను కుంటున్నారు కానీ వాళ్ల అసలైన కోపం నిర్మాతల మీద! ‘ఏదో హంగు చేసి సినిమా రిలీజు చేసే బదులు, నాలుగు వారాలు మా థియేటర్లు నిండేలా మంచి సినిమాలు తీస్తే మీ సొమ్మేం పోయింది?’ అని. సినిమా బాగోపోతే ప్రేక్షకుడు ఆగ్రహం చూపించిది థియేటరు సీట్ల మీదేగా!
తెలుగు సినీ పరిశ్రమ దిద్దుబాటు చర్యలు తీసుకుందా? ఎవరికి వారు తమ సినిమా విడుదల సమయంలోనే తమకు అనుకూలమైన వాదనలు వినిపిస్తారు తప్ప, పరిశ్రమలో చిన్నా, చితకా అందరూ మనగలిగేలా ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందిద్దామని ఆలోచించరు. థియేటర్లే సినిమా మనుగడకు మూలమని తెలుసు, ఆ థియేటర్లలో 80% పెద్ద తలకాయల చేతుల్లో ఉన్నాయని తెలుసు, మరి వందలాది థియేటర్లకు 8 ఏళ్లగా లైసెన్సులు లేని పరిస్థితి ఎలా వచ్చింది? లైసెన్సు లేని థియేటర్లు, ఫయర్ క్లియరెన్సు లేని థియేటర్లు లైసెన్సులు తెచ్చుకోండని సెప్టెంబరులోనే చెప్పారని, కానీ వాళ్లు స్పందించలేదనీ ఆంధ్ర మంత్రి పేర్ని నాని చెప్తున్నారు.
మూణ్నెళ్లగా ఏమీ చేయలేదు కానీ, నాలుగు వారాల గడువు యివ్వాలని యిప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు. అంటే సంక్రాంతి సీజన్ అయిపోయేవరకు ప్రభుత్వం కళ్లు మూసుకుంటే వాళ్ల డబ్బులు వాళ్లకు వచ్చేస్తాయి. తర్వాత నందో రాజా భవిష్యతి. మళ్లీ సమ్మర్ సీజను ప్రారంభమయ్యే వరకు సాగదీసినా ఫర్వాలేదు. ఈ లోపుగా 1997లో దిల్లీ ఉపహార్ థియేటర్లో జరిగినట్లు ఏదైనా థియేటరులో నిప్పంటుకుంటే, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, యింట్లో ఒకరికి ఉద్యోగం, యింటి స్థలం అడగవచ్చు. ఈ క్షాళన కార్యక్రమం ఎప్పుడు మొదలుపెట్టినా, ఇప్పుడేం ఎందుకు చేస్తున్నారు? ఇంతకుముందు ఎందుకు చేయలేదు? తర్వాత చేస్తే మీ సొమ్మేం పోతుంది? ఇదంతా కక్షసాధింపు చర్య కాకపోతే మరేమిటి? వంటి ప్రశ్నలు సంధిస్తూనే వుండవచ్చు.
ఆంధ్రప్రభుత్వం యీ కసరత్తు మొదలుపెట్టడం వెనుక ఏవో కారణాలున్నాయనే అనుకుందాం. కానీ దానివలన మంచే జరుగుతోంది. లోపాలు సరిదిద్దుకోవడం యిష్టం లేని థియేటర్లు మూతబడుతున్నాయి. సరిదిద్దుకున్న థియేటర్లకు ప్రేక్షకులు ధైర్యంగా వెళ్లవచ్చు. ఇక టిక్కెట్టు ధరలంటారా? అడ్డు పడడానికి కోర్టులున్నాయి, సంక్రాంతి రిలీజు బిజినెస్‌పై ఆధారపడిన అనేకమంది వ్యాపారస్తులున్నారు, వాళ్లలో అధికార పార్టీ సభ్యులూ ఉంటారు. అంతా కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు. వాయిదాలు వేయిస్తారు. వేయకపోయినా క్షేత్రస్థాయిలో అధికారులు ఎలాగూ కుమ్మక్కవుతారు. ప్రభుత్వాదేశాలు అమలు కాకుండా చూస్తారు. కొంతకాలం పాటు హడలగొట్ట గలిగానన్న తృప్తి ప్రభుత్వానికి మిగులుతుంది తప్ప తెలుగు పరిశ్రమ బాగుపడడానికి 2022 నాంది పలుకుతుందన్న ఆశాభావం నాకేమీ లేదు.
బాగుపడే సూచనలు లేశమైనా వుండి వుంటే దృశ్యం వంటి కథ మన తెలుగు రంగం నుంచే తయారై వుండేది. మన దగ్గర రచయితలు లేరని కాదు. మన నిర్మాతలు, దర్శకులు ఆదరించరంతే! ‘‘గురు’’ సినిమా దర్శకురాలు, తెలుగమ్మాయి ఆ కథతో వెంకటేశ్‌ను ఎప్రోచ్ అయితే కాదన్నారనీ, హిందీ, తమిళ వెర్షన్లు హిట్ అయ్యాక సరేనన్నారనీ విన్నాను. ‘‘బజరంగీ భాయిజాన్’’ కథను విజయేంద్ర ప్రసాద్ మొదట తెలుగు హీరోలకు వినిపిస్తే తిరస్కరించారనీ విన్నాను. సల్మాన్ ఓకే చేసి, హిట్ చేయడం, యిప్పుడు సీక్వెల్ చేయడం అందరికీ తెలుసు. ఇలాటివి ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు.
నాకు చాలామంది ఉత్తరాలు రాస్తూ వుంటారు. సినిమాకై నా దగ్గర మంచి కథ వుంది. మీరు విని లేదా చదివి మెచ్చుకుంటే, నేను నా ప్రయత్నాలు చేసుకుంటాను, మీరే ఎవరికైనా సిఫార్సు చేస్తే మరీ సంతోషం అంటూ. మన తెలుగులో పరిస్థితి ఏమిటంటే, చాలామంది దర్శకులు వాళ్ల కథను వాళ్లే రాసుకుంటున్నారు. స్టోరీ ఐడియా ఒకటి అనుకున్నాక, మీ దగ్గర సత్తా వుందని, వాళ్ల ఆలోచనలకు అనువుగా వుంటారని తోస్తే స్టోరీ టీములో పెట్టుకుంటారు. కానీ స్టోరీ కాపీరైటు వాళ్లదే. సినిమా హిట్టయితే రీమేక్స్ రైట్స్ వాళ్లవే కాబట్టి యీ జాగ్రత్త తీసుకుంటున్నారు. దర్శకుడి ఆలోచనా పరిధిలో మీ కథ యిమిడితేనే దానికేసి చూస్తాడు. ఈ పరిస్థితుల్లో కథ పట్టుకుని తిరగడంలో చాలా టైము వేస్టవుతుంది. విభిన్నమైన కథ కోసం వెతుకుతున్న దర్శకుడు తారసిల్లితే మీ అదృష్టం అనుకోవాలి. మలయాళంలో యీ పరిస్థితి లేదనుకుంటాను. అందుకే అక్కడ కొత్త కొత్త ఐడియాలతో కథలు పుడుతున్నాయి, సినిమాలు తయారవుతున్నాయి. విజయవంతమౌతున్నాయి. తెలుగు సినిమాలలో ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేదాకా కథే ప్రారంభం కాదు. సెకండ్ హాఫే ముఖ్యమౌతోంది. అది బాగుంటే సినిమా ఆడుతోంది, లేకపోతే లేదు.
మన దగ్గర ఎవరైనా కొత్త దర్శకుడు కొత్త తరహా కథతో సినిమా తీసి హిట్ చేశాడనుకోండి. రియల్లీ యంగ్ లుకింగ్ కొత్త హీరో రంగంపై వచ్చేస్తాడు. వెంటనే సీనియర్ హీరోలు ఎలర్ట్ అవుతారు. దర్శకుడికి కబురు పెట్టి నా తర్వాతి సినిమా నీతోనే, కథ సిద్ధం చేసుకో అంటారు. అబ్బ, ఎంత గొప్ప ఛాన్సో అనుకుంటూ అతను అతన్ని మెప్పించే కథ గురించి కిందామీదా పడుతూ కథలు చెప్తూ వుంటాడు. అబ్బే, యింకా బాగా చెక్కాలి అంటూ తాత్సారం చేస్తూ, అతను యీ లోపున మరో హీరోని తయారు చేయకుండా చూస్తారు. ఈ లోగా హీరో హిందీయో, తమిళమో, మలయాళమో రీమేక్‌కు సైన్ చేస్తాడు. ఈ దర్శకుడి సంగతా? విజయవంతమైన సినిమా తీసి ఏళ్లూ, పూళ్లూ అయినా అతను యిలాగే తుప్పు పట్టిపోతాడు. అతనికి క్రమంగా తనపై తనకు విశ్వాసం నశిస్తుంది. చివరకు తన క్రియేటివిటీ నశించి, ప్రేక్షకులకు నచ్చే సినిమా కాకుండా, హీరో మెచ్చే సినిమా తీస్తాడు. ఫ్లాపవుతుంది. హీరో మళ్లీ అతన్ని గడప తొక్కనివ్వడు.
పోనీ ఆ రీమేక్ నేనే తీస్తానండీ అంటే దాన్ని యథాతథంగా తీయనివ్వరు. నా యిమేజికి తగ్గట్టు మార్పులు చేయాలంటారు. ‘‘పింక్’’ సినిమా రేంజ్ ఎంత చిన్నది చెప్పండి. ఏ వెంకటేశో, రాజేంద్ర ప్రసాదో అమితాబ్ పాత్ర వేసి వుంటే సరిపోయేది. పవన్ కన్ను పడింది. ‘‘వకీల్ సాబ్’’లో హీరోయినూ వగైరా వచ్చి చేరారు. సినిమా భారీ బజెట్ అయింది. తెరపై చూడ్డానికి కోర్టు డ్రామా తప్ప ఏమీ లేదు. కానీ భారీ సినిమా పేరుతో హెచ్చు రేట్లకు అమ్మారు. ఆ రేటుకి ఆ సినిమా కిట్టుబాటా? ‘‘అయ్యప్పనుమ్ కోషియుమ్’’ సినిమా చూస్తే దానికి పెద్దగా ఖర్చేమీ కాలేదని అర్థమౌతుంది. కథలో ఖర్చుకి స్కోపు కూడా ఏమీ లేదు. కానీ ‘‘భీమ్లా నాయక్’’ అంటూ భీకరమైన హై బజెట్ సినిమా తీసేస్తున్నారు. ‘‘లూసిఫర్’’ సినిమా రీమేక్ చిరంజీవితో అనగానే దాన్నీ ఎక్కడికో తీసుకుపోయి, టిక్కెట్టు 2 వేలంటారు. ఇవేమైనా సెట్స్ భారీగా వున్న చారిత్రాత్మకాలా? జానపదాలా? సైఫియా? యానిమేషనా? హేమాహేమీల మల్టీస్టారర్సా? అవి హైబజెట్ అయ్యాయంటే హీరోల పారితోషికాల వలననే తప్ప సినిమాకు అవసరమై కాదు. తక్కినది ‘‘దృశ్యం 2’’ అనే వ్యాసంలో! (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)