భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల దగ్గరకు వచ్చేసింది. కానీ ఆంధ్రలో టికెట్ ల రేట్లు, థియేటర్ల పరిస్థితి అనుకూలంగా లేదు. ఈ నేపథ్యంలో గతంలో డిసైడ్ చేసిన కొనుగోలు ధరలు ఏమాత్రం తమకు గిట్టుబాటు కాదని బయ్యర్లు తెగేసి చెబుతున్నారు. కనీసం యాభై శాతం తగ్గిస్తే తప్పు విడుదల చేయడం తమ వల్ల కాదంటున్నారు. అలా కాకపోతే తమ అడ్వాన్స్ లు వడ్డీతో ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు నిర్మాత దానయ్యతో ఆంధ్ర, సీడెడ్ బయ్యర్ల సమావేశం రేపు జరగబోతోంది. ఆర్ఆర్ఆర్ ను ఆంధ్రకు 100 కోట్ల రేషియోలో, సీడెడ్ కు 40 కోట్ల రేషియోలో విక్రయించేసారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అందులో సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు.
ఉదాహరణగా బ్లాక్ బస్టర్ గా చెప్పుకుంటున్న అఖండ వైజాగ్ ఏరియాకు ఆరు కోట్లు చేసింది. అప్పటికీ ఇంకా నూరు, నూట యాభై కి టికెట్ ల అమ్మకాలు జరిగాయి. అలాగే పుష్ప సినిమా అదే ఏరియాకు ఏడు కోట్లు చేసింది. దానికి కూడా చాలా చోట్ల నూరు, నూట యాభై అమ్మకాలు జరిగాయి. కానీ ఇప్పడు ప్రభుత్వం చాలా కట్టడి చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ వైజాగ్ ఏరియాకు 25 కోట్లు వసూలు చేయాలి. ఇది సాధ్యమయ్యే ఫీట్ యేనా? యూనిఫారమ్ గా 300 అమ్మితే తప్ప వీలు కాదు.
ఈస్ట్ లో అఖండ నాలుగు కోట్లు చేయడం కష్టమైంది. పుష్ప పరిస్థితి కూడా అంతే పది రోజులకు బ్లాక్ బస్టర్ టాక్ తో తెచ్చుకున్నది నాలుగు కోట్లే. అలాంటిది ఆర్ఆర్ఆర్ 17 కోట్లు వసూలు చేసాయి. సాధ్యమేనా?
సంక్రాంతి సీజన్. మరో సినిమా లేదు. ఇద్దరు టాప్ హీరోలు, రాజమౌళి ఇన్నీ కలిస్తే పోనీ అఖండ, పుష్పలకు డబుల్ వసూలు చేస్తాయి అనుకున్నా, అమ్మకం రేట్లలో సగం కావడం లేదు.
ఏడు లోగా రేట్లు వస్తాయో రావో తెలియదు. సీజ్ అయిన థియేటర్లు తెరచుకుంటాయో లేదో తెలియదు. నూరు, నూటయాభై అమ్మడానికి అవకాశం ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ బయ్యర్లు అంతా ఆందోళనకు గురవుతున్నారు.
బయ్యర్ల తరపున సాయి కొర్రపాటి నిర్మాత దానయ్యతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు సమావేశం జరగబోతోంది.