కేవలం నిందితురాలు కాదామె, దోషిగా నిర్ధారణ అయ్యి శిక్షను కూడా ఎదుర్కొన్నారు. ఆ శిక్ష కాలం దాదాపు ముగుస్తోంది. సరిగ్గా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా శశికళ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని శశికళ భావించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.
ఇప్పటికీ తమిళనాడులో ఆమె నామినేట్ చేసిన ముఖ్యమంత్రే ఉన్నాడు! ఆయనే వచ్చే ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకే తరఫున సీఎం అభ్యర్థి అవుతారట. ఆయన ఇటీవల స్పందిస్తూ కూడా శశికళ పట్ల విధేయతను కనబరిచినట్టుగా ఉన్నారు.
తననే గాక, జయలలితను సీఎంగా చేసింది కూడా శశికళే అంటూ ఆయన వ్యాఖ్యానించారట. ఈ నేపథ్యంలో శశి జైలు నుంచి బయటకు విడుదల అయితే పళనిస్వామి వెళ్లి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసినా చేసేలా ఉన్నారు!
అదే జరిగితే శశికళ మళ్లీ వెనుక నుంచి అన్నాడీఎంకే రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదు. ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఎలా డబ్బులు సర్దాలి అనే అంశాలను శశి డిసైడ్ చేసి మళ్లీ అన్నాడీఎంకేను తన గుప్పిట్లోకి తీసుకునే అవకాశాలున్నాయి. కానీ బీజేపీ వాళ్లు అంత అవకాశం ఇస్తారా? అనేది ప్రశ్నార్థకం.
ఆ సంగతలా ఉంటే.. అంతర్గత రాజకీయాలు కాకుండా, ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని శశి భావిస్తోందనే వార్తలు తాజాగా వస్తున్నాయి. ఆమె దోషిగా నిర్ధారణ కావడం, రెండేళ్లకు మించి శిక్షను ఎదుర్కొనడంతో సహజంగానే ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేకుండా పోయాయి.
అయితే ఇప్పటికీ తను నిర్దోషే అని శశికళ మరో పిటిషన్ వేయబోతున్నారట. ఇది వరకూ కోర్టు విచారణ చేసి, తనకు శిక్ష విధించిందని, ఆ శిక్షను తను అనుభవించినప్పటికీ, తనపై నమోదైన కేసుల్లో విచారణను మళ్లీ సాగించాలని ఆమె ఒక పిటిషన్ వేయనున్నారట.
జైలు శిక్షను అనుభవించినప్పటికీ మళ్లీ విచారణ జరపాలని ఆమె కోరనున్నారట. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు తీసుకుని, తనకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును ఇవ్వాలని ఆమె కోరనున్నారని తెలుస్తోంది.
ఆ పిటిషన్ విచారణార్హత పొందితే, శశి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూండా ఉంటుందట! ఒకవేళ ఆమె మళ్లీ దోషిగా నిర్దారణ అయితే.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. అంతేగానీ మళ్లీ శిక్ష పడేదేమీ ఉండదు కాబట్టి.. ఈ అవకాశాన్ని శశి ఉపయోగించుకునే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది.