జనసేన పార్టీ ఇవాళ పదేళ్ల వార్షికోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. 2014, మార్చిలో పార్టీ స్థాపించిన పవన్‌కల్యాణ్ తాను సాధించిన పురోగతిని చెప్పే పరిస్థితి వుందా? అని ప్రశ్నిస్తే… లేదనే చెప్పొచ్చు. జనసేన స్థాపించిన మొదలు జగన్ వ్యతిరేకతే ఎజెండాగా పవన్‌కల్యాణ్ పని చేస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం గమనార్హం. టీడీపీ-బీజేపీ కూటమిగా ఏర్పడితే, దానికి బేషరతుగా మద్దతు పలికి తన లక్ష్యం ఏంటో చెప్పకనే చెప్పారు.
2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోవడంతో జనసేన ఆశయం నెరవేరిందని పవన్‌కల్యాణ్ సంబరపడ్డారు. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో పవన్‌కల్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చానన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టిన జనసేనాని, మళ్లీ కొత్త వేషంలో మన ముందుకొచ్చారు.
బాబు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీల్చి, తిరిగి టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్‌కల్యాణ్ వేషం మార్చారు. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పవన్ కూటమి కట్టారు. బీఎస్పీతో కూటమి కట్టడం వెనుక పవన్ భారీ వ్యూహం ఉందన్నది అందరికీ తెలిసిందే. తద్వారా దళితుల ఓట్లను తన వైపు తిప్పుకుని, వైసీపీ ఓటు బ్యాంక్‌కు గండికొట్టాలని ఎత్తుగడ వేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో తిరుపతిలో బీఎస్పీ అధినేత్రి మాయావతికి పాదాభివందనం చేసి, దళితులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
లోకేశ్, చంద్రబాబు బరిలో నిలిచిన స్థానాల్లో పవన్ ప్రచారం చేయలేదు. అలాగే పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారానికి వెళ్లలేదు. దీంతో పవన్, చంద్రబాబు పరస్పరం లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని జనం గ్రహించారు. ఇటు చంద్రబాబు, అటు పవన్‌కు జనం కర్ర కాల్చి వాతలు పెట్టారు. అప్పటి నుంచి జగన్‌పై మరింత అక్కసు పెంచుకున్నారు. ఎలాగైనా జగన్‌ను గద్దె దింపాలని పంతం పట్టారు.
ఈ నేపథ్యంలో తనకు తానుగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనంటూ పెద్దన్న పాత్ర పోషించాలని ఉబలాటపడుతున్నారు. మరోవైపు అధికారికంగా మిత్రపక్షమైన బీజేపీని టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. సరిగ్గా ఏడాది క్రితం తొమ్మిదో వార్షికోత్సవ సభలో జగన్‌ను గద్దె దింపడానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీని వేడుకున్నారు. ఇంత వరకూ రోడ్ మ్యాప్ ఆచూకీ లేదు. మరోవైపు జనసేనతో పొత్తుపై టీడీపీ మౌనాన్ని ఆశ్రయించింది. పవన్‌కల్యాణ్‌తో పొత్తు విషయమై ఎవరూ ఏమీ మాట్లాడొద్దని తమ పార్టీ నాయకులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఇదిలా వుండగా జనసేనకు అంతోఇంతో నమ్మకమైన కాపులు, బలిజలే. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు వారికెంత మాత్రం ఇష్టం లేదు. ఈ విషయమై నేరుగా పవన్‌కల్యాణ్‌కే మాజీ మంత్రి, కాపు నాయకుడు హరిరామజోగయ్య రెండు రోజుల క్రితం సమావేశంలో స్పష్టంగా చెప్పారు. తన ఓటు బ్యాంక్ మనసెరిగి స్వతంత్రంగా పోటీ చేయడమా? లేక తమ వారి ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి టీడీపీతో పొత్తు పెట్టుకోవడమా?… తేల్చుకునే క్రమంలో పవన్ గందరగోళంలో పడ్డారు.
ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం మచిలీపట్నంలో నిర్వహించనున్న వార్షికోత్సవ సభ ప్రాధాన్యం సంతరించుకుంది. గత పదేళ్లలో జనసేన ప్రస్థానం చంద్రబాబు పల్లకీ మోయడం, జగన్‌ను వ్యతిరేకించడమే లక్ష్యంగా సాగింది. కనీసం రానున్న రోజుల్లోనైనా అందుకు విరుద్ధంగా స్వతంత్ర రాజకీయం మొదలు పెట్టి కాపులతో పాటు తనను నమ్ముకున్న వారి ఆత్మాభిమానాన్ని కాపాడుతారని ఆశిద్దాం.