ఆనందయ్య అష్టదిగ్బంధం.. ఈసారి దారేది?

ఆనందయ్యకు అన్నివైపుల నుంచి సెగ మొదలైంది. స్థానికులు తమ ఊరిలో మందు పంపిణీకి వీల్లేదంటున్నారు. ఆయుష్ శాఖ తమ అనుమతుల కోసం ఎవరూ సంప్రదించలేదని తేల్చిచెప్పింది. తాజాగా.. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆనందయ్యకు…

ఆనందయ్యకు అన్నివైపుల నుంచి సెగ మొదలైంది. స్థానికులు తమ ఊరిలో మందు పంపిణీకి వీల్లేదంటున్నారు. ఆయుష్ శాఖ తమ అనుమతుల కోసం ఎవరూ సంప్రదించలేదని తేల్చిచెప్పింది. తాజాగా.. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆనందయ్యకు నోటీసు ఇచ్చారు. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలన్నారు.

ఆనందయ్య ఆయుర్వేదం మందుపై ఓ దినపత్రికలో ప్రకటన వచ్చిందని. అందులో ఒమిక్రాన్ కు మందు తయారు చేస్తున్నట్టు ఉందని, ఆ ప్రకటన ఆనందయ్య ఇచ్చారా లేక ఇంకెవరైనా ఇచ్చారా అంటూ ఆ నోటీసులో ఆయన్ను ప్రశ్నించారు అధికారులు.

ఒకవేళ ఆనందయ్యే ఆ ప్రకటన ఇచ్చినట్టయితే.. డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ 1940 ప్రకారం ఆయన సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. వారం  రోజుల్లోగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కి వచ్చి ఆనందయ్య తగిన వివరాలివ్వాలంటూ నోటీసిచ్చారు.

పంచాయతీ తీర్మానం..

మరోవైపు కృష్ణపట్నం పంచాయతీ కూడా ఆనందయ్య మందు పంపిణీకి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఆనందయ్య మందు పంపిణీ చేస్తే గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గతంలో కూడా ఆయన మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి కరోనా రోగులు పెద్ద సంఖ్యలో కృష్ణపట్నంకు వచ్చారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో ఆనందయ్య మందు పంపిణీకి పంచాయతీ అనుమతివ్వట్లేదని సర్పంచ్ సహా గ్రామస్తులు తీర్మానించారు.

ఆయుష్ నంచి పరోక్ష హెచ్చరిక..

గతంలో ఆనందయ్య నుంచి ఒమిక్రాన్ మందు అనే ప్రకటన రాగానే.. ఆయుష్ శాఖ అప్రమత్తమైంది. ఒకరిద్దరు ఆయుర్వేద వైద్యులు ఒమిక్రాన్ కి మందు కనిపెట్టినట్టు ప్రచారం చేసుకుంటన్నారని, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని అయితే.. తామెవరికీ అనుమతి ఇవ్వలేదని ఆయుష్ విభాగం ప్రకటించింది. అంటే పరోక్షంగా ఆనందయ్యకి మందు పంపిణీ విషయంలో ఆయుష్ నంచి హెచ్చరిక వచ్చినట్టయింది.

ఆనందయ్య కిం కర్తవ్యం..?

ఆనందయ్య ఇప్పుడేం చేయాలి. కలెక్టర్ కి 2 రోజుల్లో సంజాయిషీ ఇస్తానని ఆయన నోటీసుకి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అదే సమయంలో సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం కూడా ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ అపాయింట్ మెంట్ దొరకని పక్షంలో మరోసారి న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించే అవకాశం ఉంది.

కానీ ఈసారి న్యాయస్థానంలో కూడా ఆనందయ్యకి ఊరట దొరికే అవకాశం లేదు. ఎందుకంటే.. ఒమిక్రాన్ విషయంలో వైద్యులకి కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇంకా చెప్పాలంటే పూర్తిస్థాయిలో లక్షణాల్ని కూడా వైద్యులు ఇంకా నిర్థారించలేదు. ఈ దశలో ఆనందయ్య ఒమిక్రాన్ మందు ఇస్తానంటే కోర్టులు ఒప్పుకుంటాయా..? ఆయుష్ అనుమతి ఇస్తుందా..? స్థానిక అధికారులు ఆనందయ్య ప్రచారాన్ని చూస్తూ ఊరుకుంటారా..? అన్నిటికీ మించి స్థానికంగా ఆనందయ్య ఉంటున్న ఊరే ఆయన్ను వద్దు పొమ్మంటోంది. మా ఊరిలో వద్దు.. ఇంకెక్కడైనా దుకాణం పెట్టుకో అంటున్నారు గ్రామస్తులు.

మొత్తమ్మీద సెకండ్ వేవ్ లో ఓ వెలుగు వెలిగిన ఆనందయ్య.. థర్డ్ వేవ్ వచ్చే నాటికి ఇలా అష్టదిగ్బంధంలో ఇరుక్కుపోయారు. విధి విచిత్రం అంటే ఇదేనేమో..!