ఏపీలో మంచి సరుకు దొరకడం లేదని ఇప్పటికే టీడీపీ నేతలు చాలా సార్లు వాపోయారు. చివరకు హైదరాబాద్ లో మకాం పెట్టిన చంద్రబాబు కూడా ఏపీలో మంచి బ్రాండ్ల మద్యం దొరకడం లేదని అనేక సార్లు వాపోయారు. ఏపీలో మంచి మద్యం దొరకడం లేదని, దీంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి కొందరు తాగి వస్తున్నారని, ఇంకొందరు శుభ్రంగా సారాయి కాచుకుంటున్నారని, ఇంకొందరు గంజాయి కొడుతున్నారంటూ.. కల్లు కొట్టు కబుర్లను చెప్పారు చంద్రబాబు నాయుడు.
ఇక ఏపీలో దొరుకుతున్న మద్యం బ్రాండ్లన్నింటితోనూ టీడీపీ వాళ్లు పలు సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. పేరున్న బ్రాండ్ల మద్యం దొరకడం లేదని వీరు ఇలా వాపోయారు!
ఇక బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీలో కింగ్ ఫిషర్ బీరు దొరకడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏవేవో బ్రాండ్లు దొరుకుతున్నాయని, కింగ్ ఫిషర్ బీర్ మాత్రం దొరకడం లేదన్నారు. అయితే.. ఇంతకీ ఇది నిజమేనా? అని వాకబు చేస్తే, నిక్షేపంగా దొరుకుతుందని, కావాలంటే సోము వీర్రాజు తమ వెంట రావొచ్చని, పలువురు చెబుతున్నారు.
ఏపీలో ప్రభుత్వ అనుమతితో మద్యం అమ్ముతున్న వైన్ షాపుల్లో అయినా, బార్లకు వెళ్లినా.. కింగ్ ఫిషర్ బీరు దొరుకుతోందని, త్రీస్టార్ బార్ లలో ప్రస్తుతం కింగ్ ఫిషర్ బీరు ధర ఎంత ఉందో కూడా వారు చెబుతున్నారు. అయితే ఏపీలో కింగ్ ఫిషర్ బీర్ దొరకడం లేదని తీవ్రంగా బాధపడ్డారు బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుల వారు!తాగే వాళ్లేమో తాము ఆయనకు కూడా ఇప్పిస్తామని చెబుతున్నారు. మరి వారితో వీర్రాజు సంప్రదించుకుంటే సరిపోతుంది.
ఇక మద్యం విషయంలో టీడీపీకి బీజేపీ గట్టి పోటీనే ఇస్తోంది. తాము అధికారంలోకి వస్తే.. పేరున్న బ్రాండ్ల మద్యాన్ని ఏరులై పారిస్తామని టీడీపీ వాళ్లు చెప్పకనే చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏపీలో దొరకని బ్రాండు ఉండదని వారు తమ ప్రెస్ మీట్ల ద్వారా హామీ ఇస్తున్నారు. ఇక బీజేపీ వాళ్లేమో.. తమకు అధికారం ఇస్తే యాభైకే చీప్ లిక్కర్ అంటూ ప్రామిస్ చేసేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగితే, ఆ డబ్బుతో మద్యాన్ని తక్కువ రేటుకే ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పారు.
ఎవడైనా రాష్ట్రం ఆదాయం పెరిగితే.. అభివృద్ధి చేస్తామనో, సంక్షేమ పథకాలు అమలు చేస్తామనో చెబుతాడు. అయితే బీజేపీ వాళ్లు మాత్రం రాష్ట్ర ఆదాయం పెరిగితే మద్యం మీద సబ్సీడీ ఇచ్చి, రేట్లు తగ్గిస్తారట! ఈ ప్రకటనతో.. టీడీపీకి బీజేపీ గట్టి పోటీనే ఇచ్చేలా ఉంది.