సోము వీర్రాజును అసహ్యించుకున్న కేటీఆర్

ఏపీలో నిన్న బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలా మాట్లాడమేమిటని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్…

ఏపీలో నిన్న బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలా మాట్లాడమేమిటని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించాలనే యావలో నోరు జారాడు. తనేం మాట్లాడాడో తనకే తెలియదు.

బీజేపీ అధికారంలోకి వస్తే 75కే చీప్‌ లిక్కర్‌ ఇస్తామన్నారు. ఆదాయం ఇంకా బాగుంటే 50 రూపాయలకి తగ్గిస్తాం అంటూ హామీనిచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ మీద అధికార టీఆర్ఎస్ ఫుల్లుగా రగిలిపోతున్న సంగతి తెలిసిందే కదా. తెలంగాణా బీజేపీ నాయకుల మీద వీరంగం వేస్తున్న గులాబీ పార్టీకి పొరుగున ఏపీలో సోము వీర్రాజు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.

తిట్టడానికి తెలంగాణా వాడేముంది ? ఆంధ్రా వాడేముంది ? బీజేపీ వాడైతే చాలు. ఏపీ బీజేపీ ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు చేసిన లిక్కర్‌ కామెంట్‌కి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కిక్కెక్కించే కౌంటర్ ఇచ్చారు. అధికారం కోసం ఇంతలా దిగజారుతారా..? అంటూ ప్రశ్నించారు. మరో మాటలో చెప్పాలంటే అసహ్యించుకున్నారు.

లిక్కర్ పై సోము వీర్రాజు చెప్పిందాన్ని ఆఫర్ అనాలో, స్కీమ్ అనాలోగానీ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం నిస్సిగ్గుగా అధికారం కోసం ఇంత దిగజారడమా.. అంటూ ట్వీట్ చేశారు. అయినా ఈ ఇది బీజేపీ నేషనల్ పాలసీనా లేదంటే.. ఎక్కడైతే అధికారంలేదో అక్కడ అర్రులు చాస్తూ ఇస్తున్న హై ఆఫరా అంటూ కేటీఆర్ క్వశ్చన్ చేశారు.

నేషనల్‌వైడ్‌గా ఇప్పుడు సోము వీర్రాజు ఓ హాట్ టాపిక్ గా మారారు. లిక్కర్ తాగేవాళ్లు కోటి మంది ఓట్లు వేస్తే నాణ్యమైన చీప్ లిక్కర్‌ సరసమైన ధరలకే ఇస్తామని సోము వీర్రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏపీలో బీజేపీ సోదిలోనే లేదు. అలాంటి పార్టీ పరువు సోము వీర్రాజు బెలూన్ లో గాలి తీసేసినట్లు తీసేశాడు.