లాక్ డౌన్లు స‌రికాదు, కోవిడ్ తో స‌హ‌జీవ‌న‌మే మందు!

మ‌ళ్లీ కోవిడ్ కోర‌లు చాస్తున్న‌ట్టుగా ఉంది. గ‌త ఇర‌వై నాలుగు గంటల్లో ఇండియాలో దాదాపు తొమ్మిది వేల‌కు పైగా కేసులు వ‌చ్చాయి. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే.. ఈ సంఖ్య పెరిగింది. దాదాపు మూడు…

మ‌ళ్లీ కోవిడ్ కోర‌లు చాస్తున్న‌ట్టుగా ఉంది. గ‌త ఇర‌వై నాలుగు గంటల్లో ఇండియాలో దాదాపు తొమ్మిది వేల‌కు పైగా కేసులు వ‌చ్చాయి. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే.. ఈ సంఖ్య పెరిగింది. దాదాపు మూడు వేలకు పైగా ఒకే రోజు కేసుల సంఖ్య పెరిగింది. ఇంకోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు సంఖ్య కూడా పెరుగుతూ ఉంది.

ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య ప‌దుల సంఖ్య‌ను తాకుతోంది. అలాగే రోజుకు ప‌ది వేల స్థాయిలో కేసులు రిజిస్ట‌ర్ అవుతున్న నేప‌థ్యంలో… వాటిల్లో ఒమిక్రాన్ జాడ‌లెంత వ‌ర‌కూ ఉన్నాయో అనే అనుమానాలు రేగుతూ ఉన్నాయి.

స్థూలంగా మ‌రో వేవ్ వ‌స్తుందా? అనేది ఆందోళ‌న‌క‌ర‌మైన ప్ర‌శ్న‌గా మారింది. కోవిడ్ పీడ విర‌గ‌డ అయ్యింద‌నుకుంటున్న ద‌శ‌లో… అంద‌రికీ హెర్డ్ ఇమ్యూనిటీ వ‌చ్చింద‌నుకుంటున్న త‌రుణంలో.. కొత్త వేరియెంట్ రూపంలో నెల రోజుల కింద‌ట ఆందోళ‌న మొద‌లు కాగా, ఇప్పుడు ఇండియాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండ‌టం మ‌రింత ఆందోళ‌న రేపుతూ ఉంది.

అయితే గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. ఒమిక్రాన్ వేరియెంట్ ప్ర‌బ‌లినా అది అంత తీవ్ర‌మైన ప్ర‌మాద‌కారి కాదు అని ప‌రిశోధ‌కులు ఘంటాప‌థంగా చెబుతూ ఉండ‌టం. ఒమిక్రాన్ వేరియెంట్ కు గురి అయిన వారు కూడా తేలిక‌గానే కోలుకుంటున్నార‌ని వైద్యులు స్ప‌ష్టం చేస్తూ ఉన్నారు. కాబ‌ట్టి.. మ‌రీ ఓ టెన్ష‌న్ అయిపోయ‌న‌క్క‌ర్లేదు.

ఇక కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయ‌ని, లాక్ డౌన్లు గ‌ట్రా వ‌ద్ద‌ని అంటున్నారు డ‌బ్ల్యూహెచ్వో సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, కేసుల సంఖ్య పెరుగుతోంద‌ని స్కూళ్ల‌ను మూసి వేసి, ప్ర‌జ‌ల‌ను ఇళ్ల నుంచి బ‌య‌ట‌క రానీయ‌కుండా చేసే చ‌ర్య‌లు వ‌ద్ద‌ని ఆమె అంటున్నారు. 

ప్ర‌జ‌లు కోవిడ్ తో స‌హ‌జీవ‌నం చేయ‌డం నేర్చుకోవాల్సిందే అని, జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటూ త‌మ ప‌ని తాము చేసుకోవ‌డ‌మే.. ప‌రిష్కారం త‌ప్ప‌, లాక్ డౌన్లు కాద‌ని.. ఈ సైంటిస్ట్ అంటున్నారు. లాక్ డౌన్ల వ‌ల్ల వేరే ప‌రిణామాలు త‌లెత్తి దుర్భ‌ర ప‌రిస్థితులు తలెత్తుతాయ‌ని, కోవిడ్ క‌న్నా అవి ప్ర‌మాద‌క‌ర‌మైన‌వ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు.