సినిమా టికెట్ల ధరలు, అలాగే ఆన్‌లైన్‌లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి జగన్ ప్రభుత్వంపై చిత్ర పరిశ్రమ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు, అలాగే వారికి దీటుగా జవాబిచ్చే క్రమంలో మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. కారణాలు ఏవైనా… ప్రస్తుతం ప్రభుత్వం, చిత్రపరిశ్రమ మధ్య గ్యాప్ పెరిగింది.
ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ వారసత్వంగా మారిపోయిందని విమర్శించారు. 50 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమపై 3 కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. కొత్తవారికి థియేటర్లు కూడా ఇవ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
రాజకీయాల్లో వారసత్వం గురించి మట్లాడతారని, మరి సినీ రంగంలో వారసత్వం మాటేంటని ఆయన నిలదీశారు. నిర్మాత నష్టపోయినప్పుడు హీరోలు ఆదుకోరని ఆరోపించారు. హీరోలు తమ పారితోషికాన్ని ఎందుకు చెప్పడం లేదని డిప్యూటీ సీఎం నిలదీశారు. సినిమా రంగంలో కొత్తవారికి అవకాశాలు లేవని నారాయణస్వామి ఆరోపించారు. రోజురోజుకూ చిత్రపరిశ్రమపై ప్రభుత్వం ఓ పథకం ప్రకారం దాడి చేస్తోందనే చర్చ జరుగుతోంది.
ఇందులో భాగంగానే విడతల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు సినీ పరిశ్రమను గుప్పెట్లో పెట్టుకున్న వాళ్లపై బాణాలు సంధిస్తున్నారనే చర్చకు తెరలేచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నందమూరితో పాటు మిగిలిన ఆ రెండు కుటుంబాల కబంధ హస్తాల్లో చిత్ర పరిశ్రమ ఉందన్న ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు వివాదం నెలకున్న నేపథ్యంలో అన్ని విషయాలు తెరపైకి వస్తున్నాయి.