శివాజీ ‘క‌మ్మ‌’ని సూక్తులు

‘‘చంద్రబాబును అంటే కమ్మ వాళ్లకు కోపం. జగన్‌ను ఏమైనా అంటే రెడ్లకు కోపం. పవన్‌ను విమర్శిస్తే కాపులకు ఆగ్రహం. మనకు కష్టం వస్తే ఏ నాయకుడూ ఆదుకోరు’’…ఇవి సినీ న‌టుడు శివాజీ వెలువ‌రించిన సూక్తి…

‘‘చంద్రబాబును అంటే కమ్మ వాళ్లకు కోపం. జగన్‌ను ఏమైనా అంటే రెడ్లకు కోపం. పవన్‌ను విమర్శిస్తే కాపులకు ఆగ్రహం. మనకు కష్టం వస్తే ఏ నాయకుడూ ఆదుకోరు’’…ఇవి సినీ న‌టుడు శివాజీ వెలువ‌రించిన సూక్తి ర‌త్నాలు.

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’  చానల్ వేదిక‌గా శివాజీ క‌మ్మ‌ని సూక్తులు చెప్పాడు. గ‌త కొంత కాలంగా ఎక్క‌డున్నాడో ఆచూకీ లేని శివాజీ, ఇప్పుడు త‌గ‌దున‌మ్మానంటూ ‘క‌మ్మ‌’ వేదిక‌పై నుంచి సినీ డైలాగ్‌లు కొట్టాడు. రాజకీయ పార్టీలన్నీ కులాలతో ‘వ్యాపారం’ చేస్తున్నాయని, జనం కూడా ఇదే మాయలో పడ్డారని వాపోయాడు.

రాజధాని మార్పు, గందరగోళం, రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై ప్రశ్నించలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలున్నార‌ని ఆయ‌న ల‌బోదిబోమ‌న్నాడు.

ఇంత‌కూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లంటే ఎవ‌రు? అమ‌రావ‌తి ప్ర‌జ‌లా? క‌మ్మ‌సామాజిక వ‌ర్గంలోని ధ‌నికులా?  రాజ‌ధాని భూస్వాములా? న‌ష్ట‌పోతున్న‌దెవ‌రు….చంద్ర‌బాబా, లోకేశా, మాజీ మంత్రి నారాయ‌ణా, టీడీపీ పారిశ్రామిక వేత్తలా? ముందు ఈ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు చెప్పు శివాజీ.

కులాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కటై రాష్ట్రాన్ని కాపాడుకోవాలా? ఏం నాయ‌నా ఇప్పుడు రాష్ట్రానికి వ‌చ్చిన ప్ర‌మాదం ఏమీ లేదు. చంద్ర‌బాబు రూపంలో ఉన్న ప్ర‌మాదం నుంచి ఆరు నెల‌ల క్రితం ప్ర‌జ‌లు త‌ప్పించుకున్నారు. అమ‌రావ‌తి కోసం అంద‌రూ బ‌త‌కాలా?  మిగిలిన ప్రాంత ప్ర‌జ‌ల కోసం మీరు మాత్రం ఏమీ చేయ‌రా?

‘జగన్‌కు 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. జగన్‌ది తప్పు లేదు. ప్రజలదే తప్పు. ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు’ అని శివాజీ ప్ర‌జ‌ల‌పై విషం క‌క్కాడు. ఓహో మీకు ప్యాకేజీతో త‌ప్ప ప్ర‌జ‌ల‌తో ప‌నిలేద‌నేనా వారిపై తిట్ల పురాణం. 2014లో మీ నాయ‌కుడు చంద్ర‌బాబును గెలిపిస్తే మాత్రం ప్ర‌జ‌లు మంచి చేసిన‌ట్టా? అప్పుడు మాత్రం ప్ర‌జ‌లు బాధ్య‌తాయుతంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టా?  కులంపై పిచ్చి ప్ర‌జ‌ల‌నే దోషులుగా నిల‌బెట్టేంత ముదిరిందా శివాజీ?

‘ఎవరికి నొప్పి పుడితే వారు గుండెలు బాదుకోవడమే! ఇప్పుడు… 29 గ్రామాల రైతులకు బాధ కలిగింది కాబట్టి ఆందోళనకు దిగారు. రాజధాని వల్ల చుట్టుపక్కల గ్రామాల్లోనూ భూముల ధ‌ర‌లు పెరిగాయి. వారిలో ఒక్కరైనా కలిసి వస్తున్నారా? మంగళగిరి, గుంటూరు, చిలకలూరిపేట, నందిగామ, ఒంగోలు… వీళ్లంతా ఏం చేస్తున్నారు? ఎందుకు పోరాడరు?’ అని శివాజీ ప్రశ్నించాడు.  

అబ్బో పిల్లొచ్చి గుడ్డును ఎక్క‌రించ‌డం అంటే ఇదే క‌దా శివాజీ. రాజ‌ధాని రైతులు రెండు వారాలుగా ఆందోళ‌న చేస్తుంటే త‌మ‌రికి ప్ర‌శ్నించ‌డానికి ఇప్ప‌టికి తీరిక దొరికిందా?  నిత్య క‌ర‌వుల‌తో అల్లాడుతూ బ‌తుకు జీవుడా అని ఊర్లు వ‌దిలి ఇత‌ర రాష్ట్రాలు, దేశాల‌కు వ‌ల‌స వెళ్ల‌డం మిమ్మ‌ల్ని ఎప్పుడైనా క‌దిలించిందా సార్‌? ఏం మీవి మాత్ర‌మేనా క‌ష్ట‌న‌ష్టాలు? ఇత‌రుల‌వి కావా? ఈ ఆక్రోశం గ‌తంలో ఎప్పుడైనా వ్య‌క్త‌ప‌రిచారా? ఎందుకు ఈ ‘కుల‌’ముసుగులు? సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఇంత న‌ట‌నా? జీవితం చిన్న‌ద‌య్యా, వేషాలు మాని కాస్త జీవించ‌డం నేర్చుకోవ‌య్యా!