నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంకానున్నాయి. ఈ కీలక సమావేశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ దూరంగా ఉండనున్నారు.
ముఖ్యమంత్రి అయ్యాకే సభకు వస్తానని ప్రతిన భూనడంతో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. మరోవైపు ఈ నెల 27తో లోకేష్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. ప్రస్తుతానికి లోకేష్ కు ఇవే చివరి సమావేశాలు. అయినా పాదయాత్ర కారణంగా ఆయన హాజరయ్యే అవకాశం లేదు. ఈ సమావేశాల్లోనే సీఎం జగన్ విశాఖకు తరలి వెళ్లనుండటంపైనా స్పష్టత ఇవ్వనున్నారు. ఇలాంటి కీలక సమావేశాలకు తండ్రి కొడుకులిద్దరు దూరంగా ఉండటం గమనార్హం
తొలిరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్‌నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఉభయసభలూ మరుసటి రోజుకు వాయిదా పడనున్నాయి. ఆ వెంటనే శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా మండళ్లు భేటీ అయి సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నాయి.
ఇదిలా ఉంటే ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం 7 లేదా 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.