ఈ సంక్రాంతి బడా హీరోల ఈగో క్లాష్‌కి వేదిక కానుంది. మహేష్, అల్లు అర్జున్ మాట అటుంచితే, ఈ సంక్రాంతికి రాబోతోన్న పెద్ద సినిమాలు ఆయా దర్శకులకి అగ్ని పరీక్ష కానున్నాయి. 'సరిలేరు నీకెవ్వరు'తో అనిల్ రావిపూడికి ప్రమోషన్ లభించింది. ఇంతకుముందు అతను చేసినవన్నీ పాతిక కోట్ల బిజినెస్ వున్న సినిమాలు కాగా, ఒకేసారి అయిదు రెట్లు ఎక్కువ బిజినెస్ అయిన 'సరిలేరు నీకెవ్వరు'తో దర్శకుడిగా పెద్ద పరీక్ష ఎదుర్కొంటున్నాడు.
అనిల్ రావిపూడి ఇంతకుముందు చేసిన చిత్రాలకి అంచనాలు అంతగా లేవు. అది అతనికి చాలా ప్లస్ అయింది. కానీ ఈసారి 'సరిలేరు నీకెవ్వరు'కి అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి. మహేష్ సినిమా అంటే అల్లాటప్పాగా వుంటే పాస్ అయిపోదు కనుక అనిల్ రావిపూడి అసలు టాలెంట్ ఏమిటనేది ఈ చిత్రంతో తెలుస్తుంది. ఇకపోతే త్రివిక్రమ్ కొంతకాలంగా తన స్థాయిని అందుకోలేక ఇబ్బంది పడుతున్నాడు.
అజ్ఞాతవాసి 'గురూజీ'పై అనుమానాలు రేకెత్తించగా, 'అరవింద సమేత'లో త్రివిక్రమ్ కంప్లీట్ డిఫెన్స్‌లో పడిపోయాడు. ఆ చిత్రం ఓ మాదిరిగా ఆడినా కానీ త్రివిక్రమ్ రేంజ్‌కి తగ్గ ఫలితాన్ని అయితే అందుకోలేదు. ఈ నేపథ్యంలో 'అల వైకుంఠపురములో' త్రివిక్రమ్‌కి కఠిన పరీక్ష కానుంది. ఈ చిత్రం పాటలు విజయవంతమయినా, టీజర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఇద్దరు దర్శకులకీ ఈ సంక్రాంతి పెద్ద పరీక్షనే పెడుతోంది. దీంట్లో ఇద్దరూ డిస్టింక్షన్లో పాస్ అవ్వాలనే కోరుకుందాం మనం.