లోకేశ్‌ను మ‌రిపిస్తున్న ఆర్‌కే

త‌న చిలిపిత‌నం, అమాయ‌క‌త్వం, అజ్ఞానాన్ని స‌మ‌పాళ్ల‌లో క‌లిపి ఈ వారం రాసిన ‘కొత్త‌పలుకు’తో ఆంధ్ర‌జ్యోతి- ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ టీడీపీ యువ‌కిశోరం నారా లోకేశ్‌ను మ‌రిపించారు. అచ్చం లోకేశ్ మాట‌ల మాదిరిగానే ఆర్‌కే రాత‌లున్నాయంటే…

త‌న చిలిపిత‌నం, అమాయ‌క‌త్వం, అజ్ఞానాన్ని స‌మ‌పాళ్ల‌లో క‌లిపి ఈ వారం రాసిన ‘కొత్త‌పలుకు’తో ఆంధ్ర‌జ్యోతి- ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ టీడీపీ యువ‌కిశోరం నారా లోకేశ్‌ను మ‌రిపించారు. అచ్చం లోకేశ్ మాట‌ల మాదిరిగానే ఆర్‌కే రాత‌లున్నాయంటే అతిశ‌యోక్తి కాదు.

ఈ వారం ‘కొత్త‌పలుకు’కు ‘అయ్యోపాపం ఏపీ! ’ అనే శీర్షిక పెట్టారు. నిజంగా ఆ క‌థ‌నం అంతా చ‌దివిన త‌ర్వాత ఆర్‌కే ఆవేద‌న‌, ఆక్రోశం, ఏడ్పు చూసిన త‌ర్వాత ‘అయ్యో పాపం ఆర్‌కే’ అని జాలి చూపాల‌నిపిస్తోంది. జ‌గ‌న్‌పై ప‌ట్ట‌రాని కోపం కావ‌చ్చు, అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని త‌ర‌లింపు పోతున్న‌ద‌నే ఆవేద‌న కావ‌చ్చు, త‌న సామాజిక‌వ‌ర్గ ఆర్థిక సామ్రాజ్య ప‌త‌నం ప్రారంభ‌మైంద‌నే గుండె మంట కావ‌చ్చు…కార‌ణాలేవైనా ఆర్‌కే కొన్ని నిజాలు ప‌లికాడు.  

‘మీరు ఒక‌టి గుర్తించండి. ఎలాంటి అవినీతి, బంధుప్రీతి, మ‌త‌పిచ్చి, కుల‌పిచ్చి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీనే. అవునా కాదా త‌మ్ముళ్లు’ అని కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌శ్నించే అమాయ‌క‌త్వం, అజ్ఞానం ఒక్క లోకేశ్‌కే సొంతం.

అలాంటి అమాయ‌క‌త్వం రాధాకృష్ణ రాత‌ల్లో త‌ర‌చూ క‌నిపిస్తూ ఉంటుంది. కాక‌పోతే ఆర్‌కే దృష్టిలో రెండు నిజాలుంటాయి. ఒక‌టి చంద్ర‌బాబు కోణంలో ఒక‌లా, జ‌గన్‌ను చూసే దృష్టిలో మ‌రోలా ఉంటుంది. ఏది ఎలా ఉన్నా ఈ వారం రాసిన కొత్త‌ప‌లుకులో అమ‌రావ‌తి కేవ‌లం కొంద‌రిది మాత్ర‌మే అని తేల్చి చెప్పాడాయ‌న‌. అమాయ‌క‌త్వం లేదా అజ్ఞానంతో చెప్పినా…నిజాన్ని చెప్పిన ఆర్‌కేను ప్ర‌తి ఒక్క‌రూ అభినందించాలి.

‘‘జగన్మోహన్‌రెడ్డి తాజా నిర్ణయం వల్ల ఇప్పటి వరకు అమరావతిని సొంతం చేసుకోవడానికి ఇష్టపడని జిల్లాలవారు.. ముఖ్యంగా రాయలసీమవాసులు ఇప్పుడు అమరావతికి సై అంటున్నారు’’

రాజ‌ధాని ఏర్ప‌డి ఐదేళ్లు గ‌డిచినా అమ‌రావ‌తిని రాయ‌ల‌సీమ‌వాసులు త‌మ‌ది అనుకోలేద‌ని ఆర్‌కే స్ప‌ష్టంగా రాశాడు. అంతే కాదు ఆయ‌న రాత‌ల ప్రకారం రాయ‌ల‌సీమ వాసుల‌తో పాటు ఇత‌ర కొన్ని జిల్లాల వాళ్ల‌కు అమ‌రావ‌తి అంటే ఇష్టం లేద‌న్న‌మాట‌. తాను రాసిన పై వాక్యానికి స‌మ‌గ్ర‌మైన అర్థం ఏంటో ఆర్‌కే వివ‌రించాలి.  

‘‘ప్రజలిచ్చిన అధికారంతో ఏమైనా చేయవచ్చునని రుజువు చేస్తున్నారు. ప్రభుత్వాలపై ప్రజలకు, సంస్థలకు ఉండాల్సిన నమ్మకాన్ని చంపేసుకుంటున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులుగా ముద్ర వేసి అవమానిస్తున్నారు’’

ప్ర‌జ‌లిచ్చిన అధికారంతో ఏమైనా చేయ‌వ‌చ్చ‌నే లెక్క‌లేని త‌నం వ‌ల్లే క‌దా 2014లో చంద్ర‌బాబు ఏక‌ప‌క్షంగా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌డం? ఇందుకు మీ రాత‌లే స‌జీవ సాక్ష్యం కాదా ఆర్‌కే? రాజధాని కోసం భూములిచ్చిన రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులుగా ముద్ర వేసి అవమానిస్తున్నారని గ‌గ్గోలు పెడుతున్నారే, శ్రీ‌శైలం ప్రాజెక్టుకు 85 వేల ఎక‌రాల భూమిలిచ్చి స‌రైన న‌ష్ట‌ప‌రిహారానికి నోచుకోని రాయ‌ల‌సీమ వాసుల‌ను గూండాలు, ముఠాకోరులు, భూక‌బ్జాదారులు, ఫ్యాక్ష‌నిస్టుల‌ని నానా తిట్లు తిడుతున్నారే, వారి ఆవేద‌న గురించి మీరెప్పుడైనా రాశారా ఆర్‌కే?  రాయ‌ల‌సీమ రైతుల త్యాగ పునాదుల‌పై నిర్మిత‌మైన ప్రాజెక్టు నీళ్ల‌తో పంట‌లు సాగు చేసుకుంటూ, మ‌ళ్లీ వారినే అవ‌హేళ‌న చేస్తున్న వారిపై ఏనాడైనా ఒక్క మాట రాశారా సార్‌?

‘‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ సంస్థల తరఫున మేము కూడా రాజధాని నిర్మాణం కోసం విరాళాలు సేకరించాం. ఈ విధంగా సేకరించిన విరాళాల మొత్తం 2 కోట్ల 52 లక్షల 47 వేల 259 రూపాయలను 2014 అక్టోబరు 24వ తేదీన అప్పటి ప్రభుత్వ అధినేత చంద్రబాబును కలిసి నేను స్వయంగా అందజేశాను. ‘నేను ఇచ్చిన 50 వేలను తిరిగి ఇస్తారా?’ అని ఒక దాత మెయిల్‌ పెట్టారు. ప్రభుత్వ పిలుపు మేరకు ‘నేను కొనుగోలు చేసిన ఇటుకల మాట ఏమిటి?’ అని మరొకరు ప్రశ్నించారు. మా సంస్థల విజ్ఞప్తి మేరకు విరాళాలు అందజేసిన వారికి మా వద్ద కూడా సమాధానం లేదు. వారందరినీ క్షమించమని వేడుకుంటున్నాం’’ అని ర‌క్త క‌న్నీళ్ల‌తో అక్ష‌రీక‌రించాడు. ఆర్‌కే చిలిపిరాత‌లంటే ఇవే మ‌రి.
   
ఆర్‌కే భ‌విష్య వాణి
ఆర్‌కే భ‌లే చిత్రివిచిత్రమైన జ‌ర్న‌లిస్టు. ఆనందం, ఆగ్ర‌హం, ఆవేద‌న …మ‌న‌సులో ఏ భావం క‌లిగినా దాచుకోరు. భ‌విష్య‌త్‌లో అమ‌రావ‌తి ఏం కాబోతుందో జ‌గ‌న్ స‌ర్కార్ కంటే ముందే ఈయ‌న చ‌క్క‌గా వివ‌రించాడు. ఏడాదికో, రెండేళ్ల‌కో నేను ఏనాడో భ‌విష్య వాణి చెప్పాన‌ని ఇదే కొత్త‌ప‌లుకులో రాసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయ‌న ఏమంటున్నారంటే…

‘‘రేపోమాపో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటుంది. అమరావతిలో కొలువైన ప్రభుత్వ కార్యాలయాలు విశాఖపట్టణానికి తరలిపోతాయి. నిర్మాణం పూర్తిచేసుకున్న భవనాలతోపాటు తుది దశకు చేరుకున్న భవనాలు, సగం సగం వేసిన రోడ్లు భవిష్యత్తులో నిజంగానే ఎడారిని తలపిస్తాయి. అద్భుతంగా నిర్మించుకోవాలనుకున్న అమరావతి ప్రాంతంలో జిల్లేడు మొక్కలు మొలుస్తాయి. ప్రస్తుత సచివాలయం, శాసనసభ భవనాలతోపాటు ఇతరత్రా కట్టడాలన్నీ భావితరాలను చూసి వెక్కిరిస్తుంటాయి కాబోలు’’…ఈ రాత‌ల‌ను చ‌దివితే  ‘అయ్యో పాపం ఆర్‌కే’ అనాలనిపిస్తోంది.

‘‘ఇప్పుడు రాజధాని రైతులకు వచ్చిన కష్టం వారిది మాత్రంగానే మిగిలింది. తమ అందరి కోసం ఆ రైతులు తమ భూములను త్యాగం చేశారన్న స్పృహ సమాజంలో కనిపించడం లేదు’’

గ‌త వారం ఆర్‌కే కొత్త‌ప‌లుకులో  ‘‘నిన్న‌టి వ‌ర‌కు ఆకాశ‌మే హ‌ద్దుగా భూముల ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఆడ‌పిల్ల‌ల పెళ్లిళ్లు సంద‌ర్భంగా క‌ట్నం కింద రెండు కోట్లు ఇస్తామ‌న్న వాళ్లు …ఆ మేర‌కు ధ‌ర ప‌లుకుతున్నందున ఎక‌రం భూమి ఇచ్చారు. ఇప్పుడు అక్క‌డ ధ‌ర‌లు ప‌డిపోవ‌డంతో మీ భూమి వ‌ద్దు…ఇస్తామ‌న్న రెండుకోట్లు ఇవ్వండి అని కొంద‌రు అల్లుళ్ల నుంచి ఒత్తిడి వ‌స్తోంద‌ని ఆడ‌పిల్ల‌ల కుటుంబీకులు వాపోతున్నారు’’ అని రాశారు.

రాజ‌ధాని భూముల రైతులు త‌మ ఆడ‌పిల్ల‌ల‌కు క‌ట్న‌కానుక‌ల కింద కోట్లాది రూపాయ‌లు ఇచ్చార‌ని మీరే చెబుతున్నారు క‌దా. ఇత‌ర ప్రాంతాల ఆడ‌పిల్ల‌ల క‌ట్నాల కోసం వీరేమైనా సాయం చేశారా? ఇత‌ర ప్రాంతాల్లో అల్లుళ్ల‌కు కోట్ల రూపాయ‌ల క‌ట్నం కాదు క‌దా…ధ‌రించే ‘కోటు’కు డ‌బ్బు లేక చ‌స్తున్నారు. ఇత‌ర ప్రాంత ప్ర‌జ‌ల బాధ రాజ‌ధాని ప్ర‌జ‌ల‌ది కాన‌ప్పుడు, ఇప్పుడు రాజ‌ధాని రైతుల బాధ త‌మ‌దిగా ఇత‌రులు ఎందుకు భావిస్తారు?

బాబు ఏం చేశాడో ఒక్క‌రోజైనా ప్ర‌శ్నించావా
‘‘నిజానికి ప్రభుత్వ ఖజానా నిండుకుంది.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్షన్నర కోట్ల రూపాయలు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు మిషన్‌ భగీరథను పూర్తిచేసి రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయగా… ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల కోసం వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. అయినా రాష్ట్రంలోని మేధావులు బెల్లంకొట్టిన రాయిలా పడి ఉంటున్నారు’’ అని ఆర్‌కే మండిప‌డ్డాడు.

అయ్యా ఆర్కే గారూ నిజానికి ప్ర‌భుత్వ ఖ‌జానా ఎవ‌రి దోపిడీ వ‌ల్ల నిండుకుందో కాస్త పెద్ద మ‌నసు చేసుకుని చెప్ప‌లేక‌పోయావా? అవున్లే మీకు కూడా యాడ్స్ రూపంలో రూ.800 కోట్లు ముట్టింది క‌దా? అందుకే ఇక్క‌డ నిజాలు చెప్ప‌డానికి డ‌బ్బు అడ్డుప‌డుతున్న‌ట్టుంది?  కేసీఆర్ కాళేశ్వ‌రం పూర్తి చేస్తే…మీ బాస్ బాబు రూ.2.50 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసి క‌నీసం పోల‌వ‌రాన్ని ఎందుకు పూర్తి చేయ‌లేక‌పోయాడు? రాష్ట్రంలోని మేధావులు బెల్లంకొట్టిన రాయిలా పడి ఉంటున్నార‌ని నిష్టూర‌మాడుతున్న మీరు కూడా ఓ మ‌హామేధావి అనే విష‌యాన్ని మ‌రిచారా? మ‌రి మీరెందుకు గ‌త ఐదేళ్ల‌లో ఏపీ పాల‌కుల‌ను ప్ర‌శ్నించ‌లేక‌పోయారు? అవున్లే మీ అక్ష‌రం ఆదాయాన్ని రుచి మ‌రిగి బాబు స్తోత్రంలో ఐదేళ్లు మునిగిపోయింది క‌దా?

‘‘రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తమకు ఏమి కావాలో ఆలోచించుకుని పదం కలపని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ అభాసు పాలవ్వడం తథ్యం!’’… శ‌భాష్ ఆర్‌కే. రాష్ట్ర ప్ర‌జ‌ల సంగ‌తిని కాసేపు ప‌క్క‌న పెడదాం. ఇప్ప‌టికైనా మీరు కుల‌, మ‌తాలు, ప్రాంతాల‌కు అతీతంగా రాష్ట్ర ప్ర‌జ‌ల శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు భ‌జ‌న‌, జ‌గ‌న్ స‌ర్కార్‌పై విషం చిమ్మ‌డం మానేస్తాన‌ని హామీ ఇస్తారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభాసుపాలు కాకుండా ఉండాలంటే ముందు మీ నుంచే మార్పు మొద‌లు కావాలి బాస్‌. ‘నీతులు ఇత‌రుల‌కు చెప్పేందుకే త‌ప్ప నాకు వ‌ర్తించ‌వ‌ని అంటారా?’ 

బాబుని ఫాలో అవడమే ఆయన చేసేది