కాలు దువ్వారు…అంతన్నారు..ఇంతన్నారు. చూసుకుందాం అనే టైపులో గ్యాసిప్ లు వదిలారు. ఒక రోజు ముందే వస్తామన్నారు. కావాలంటే అదే రోజు విడుదల చేసినా, పోటీకి రెడీ అన్నారు. 11నే విడుదల అంటూ పోస్టర్ కూడా రెడీ చేయించి వుంచుకున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు తాము కిందకు దిగేది లేదన్నారు. ఆఖరికి చివరి గంటలో మొత్తం వదిలేసారు. బుద్దిగా తాము అనుకున్న డేట్ కే వస్తామన్నారు. గిల్డ్ ద్వారా గౌరవప్రదంగా ప్రకటించేసారు.
థియేటర్ల సమస్యను భూతద్దంలో చూపించి, ఓపెనింగ్స్ బాగుండాలని తలపోసి, ముందుకు వెళ్లాలని అనుకున్న 'బన్నీ', ఆయన సచివుడు బన్నీవాస్ ల మాట ఎందుకు చెల్లకుండా పోయింది. ఇప్పుడు ట్విట్టర్ లో మహేష్ ఫ్యాన్స్ దీన్ని తమ తొలివిజయంగా భావిస్తూ విపరీతంగా ట్రోలింగ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది?
త్రివిక్రమ్ ఫస్ట్ బ్రేక్
బన్నీ-బన్నీవాస్ లు అనుకున్న ప్రణాళికకు ముందుగా గండి పడింది దర్శకుడు త్రివిక్రమ్ సెంటి మెంట్ దగ్గర. ఆయనకు జనవరి 10 వెరీ వెరీ బ్యాడ్ సెంటిమెంట్ డేట్ గా మారింది. ఆయన 10 న విడుదలకు ససేమిరా అన్నారు. 11న కావాలంటే రండి కానీ 10న మాత్రం ససేమిరా అన్నారు. దాంతో రెండు సినిమాలు ఒకేరోజు రావాల్సిన సమస్య వచ్చింది. అదే పెద్ద ట్విస్ట్ అయిపోయింది.
దీంతో బయ్యర్ల వైపు నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. ఓవర్ సీస్ లో స్క్రీన్ లు అనుకున్నన్ని దొరకవు అన్న పాయింట్ తెరమీదకు వచ్చింది. అయినా కూడా మొండిగా ముందుకే వెళ్లాలనుకున్నారు.
అరవింద్ సెకండ్ బ్రేక్
ఇటీవల కొంతకాలంగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అన్నది ఒకటి స్టార్ట్ చేసారు. దాంట్లో అరవింద్, దిల్ రాజు, చినబాబు లాంటి వారు చాలా కీలక సభ్యులు. ఇలాంటి నేపథ్యంలో అరవింద్ నే మాట వినకుండా పోటీగా సినిమా విడుదల చేస్తే, ఇక గిల్డ్ ఏముంటుంది? దాని విలువ ఏముంటుంది? భవిష్యత్ లో ఎవరు మాట వింటారు? ఇదే పాయింట్ రెండో బ్రేక్ వేసింది. దాంతో ఇంకే ముంది కథ ఖతమ్. దుకాణ్ బంద్.
ఫలితం ఏమిటి?
మూడు రోజలు తెగ గ్యాసిప్ లు పుట్టించి, ఫీలర్లు బయటకు వదిలి సాధించింది ఏమిటంటే, 12న అల వైకుంఠపురములో సినిమాకు థియేటర్లు కేటాయించే విషయంలో న్యాయం చేస్తాము అన్న మాట. ఆ న్యాయం ఎలా ఏ విధంగా సాధ్యం అన్నది తెలియదు. అలా అని సరిలేరు థియేటర్లు రెండో రోజు తగ్గించేస్తారా? అంటే అదీ కాదు అని తెలుస్తోంది. అవసరమైతే, తప్పకుంటే దర్బార్ కు కేటాయించిన థియేటర్లు అడ్జస్ట్ చేస్తామని దిల్ రాజు 'మాట' ఇచ్చారు. అదీ సంగతి.
ఓపెనింగ్ కింగ్ మహేష్ నే
ఎలా చూసుకున్నా ఓపెనింగ్ కింగ్ మహేష్ నే అవుతాడు. అతని సినిమాకు దొరికినన్ని థియేటర్లు బన్నీ సినిమాకు దొరకవు. అది వాస్తవం. అదే గ్రౌండ్ రియాల్టీ. ముఖ్యంగా సైడ్ థియేటర్లు సరైనవి ఇవ్వడం లేదు అనే కారణంతోనే ఇదంతా స్టార్ట్ అయింది. ఇప్పటికే అదే సమస్య అలాగే వుంటుంది. ఎందుకంటే ఇప్పటికే సరిలేరు సినిమాకు అగ్రిమెంట్లు చేసేసినవారు చేసేసారు. సరిలేరు, అలా సినిమాలు కాకుండా దర్బార్ కు ఎలా థియేటర్లు ఇచ్చి వుంటారో? అవి ఎలాంటివో? వాటిలో ఇప్పుడు ఏవి అల సినిమాకు కేటాయిస్తారో చూడాలి. కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఎలా వున్నా, చాలా జిల్లాల్లో మాత్రం బన్నీ సినిమాకు థియేటర్లు కాస్త సమస్యే.
తొలి రోజు 80శాతం థియేటర్లు, మర్నాడు 40శాతం థియేటర్లతో మహేష్ సినిమా మంచి ఓపెనింగ్స్ తీసుకుంటుంది. బన్నీ సినిమా తొలి రోజు మహా అయితే 50 నుంచి 60 శాతం థియేటర్లు, మర్నాడు 40 శాతం థియేటర్లు తీసుకుంటుంది. ఆ విధంగా మహేష్ సినిమా కన్నా తక్కువ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోక తప్పదు. పైగా మహేష్ సినిమా అర్థరాత్రి దాటిన తరువాత ఆటలు వేసే ఆలోచనలో వున్నారు. బన్నీ సినిమా మాత్రం తెల్లవారి అయిదుగంటల తరువాతనే స్టార్ట్ అవుతుంది.
తేలేది అప్పుడే
ఇప్పుడు ఎన్నయినా వాదించవచ్చు. రెండు సినిమాల తొలి రోజులు గడిచిన తరువాత కానీ అసలు విషయం క్లారిటీ రాదు. అప్పుడు కానీ మూడు రోజుల పాటు 'బన్నీ' వాసు కలిసి చేసిన రచ్చకు ఫలితం వుందా లేదా అన్నది తెలిసిరాదు.