టీవీ సీరియల్ జీడిపాకం మాదిరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం తయారైంది. దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం కంకణం కట్టుకుంది. అలా అని ఒక్కసారిగా ప్రైవేట్ అని వేటు వేయడం లేదు. ఒక్కో విభాగాన్ని నీరసింపచేస్తూ వస్తోంది. అలా దేనికదే వాడిపోయాక వీడిపోయాక ప్లాంట్ పూర్తిగా కుప్పకూలిందని చెప్పి ప్రైవేట్ పరం చేయాలన్నది వ్యూహంగా ఉంది కామోసు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుందని ఏపీలోని రాజకీయ పార్టీలకు తెలుసు. తెలిసి కూడా పార్లమెంట్ ప్రతీ సెషన్ లో ఆనవాయితీగా ఒక ప్రశ్న దాని మీద అడిగి మరీ పుండు మీద కెలికించుకుంటారు. కేంద్ర మంత్రులు అయితే గట్టిగా ఒకటికి పదిసార్లు మా రూట్ అదే, వేటు ఖాయం, తధ్యమంటూ గంభీరమైన ప్రకటనలు చేస్తూ ఉంటారు.
ఇదంతా టీవీల ముందు కూర్చుని జనాలు మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. రెండేళ్ళు పై దాటుతున్నా ఈ వ్యవహారం అలాగే సాగిపోతోంది. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మలి విడత మొదలయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ స్టీల్ ప్లాంట్ మీద ప్రశ్న వేశారు.
ఆయన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్ కులస్తే బదులిస్తూ మా నిర్ణయం లో ఏ మార్పూ లేదు ఆ డౌట్ ఏమీ పెట్టుకోమాకండి అని సవ్యంగానే చెప్పేశారు. కార్మికులు ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు అని కూడా తెలుసు అని ఆయన చెప్పేశారు. అయినా ప్రైవేట్ చేస్తామంటే ఎవరైనా ఆందోళనలు చేయకుండా సంబరాలు చేస్తారా. అది కేంద్ర పెద్దలకు కామన్ గా జరిగే విషయంగా అగుపిస్తే తప్పు వారిది కాదు.
ఇంతకీ కేంద్ర ప్రభువులు చెప్పేది ఏంటి అంటే మేము ఎక్కడా తగ్గేదే లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయి తీరుతుంది అని. అలా లోక్ సభలో ఇలా రాజ్యసభలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఎన్నిసార్లు ఈ ప్రశ్న వేసినా జవాబు మాత్రం ఇదే సుమా అని కేంద్ర మంత్రి ఫుల్ క్లారిటీతో చెప్పారన్న మాట.
మా రూటే ప్రైవేట్ అని కేంద్రం గట్టిగా చెబుతోంది. దేశంలో అనేక కేంద్ర సంస్థలను ప్రైవేట్ చేయాలని పాలసీగా పెట్టుకుంది. అందులో ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి. ఇది పాలసీ డెసిషన్ కాబట్టి ఒక చోట తగ్గితే మొత్తం తగ్గాల్సి ఉంటుంది. పైగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆగేది లేదు అని కేంద్రం గతంలో అనేక సంఘటనల ద్వారా చాటి చెప్పింది కాబట్టి అడగాలనుకుంటే కంఠ శోష తప్ప జవాబు మాత్రం మారదు.