పౌరసత్వానికి సంబంధించి వివాదాస్పద చట్టాలను తీసుకురావడం ద్వారా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఏం కోరుకున్నారు? అనే ప్రశ్నకు హైదరాబాద్ సమాధానం చెప్పింది. ఇలాంటి చట్టాలు దేశాన్ని మతపరంగా విడదీసే దుర్మార్గపు చట్టాలే అనే అభిప్రాయం పలువురిలో తొలినుంచి ఉంది. అందుకు నిదర్శనమే శనివారం భాగ్యనగరంలో కనిపించింది. లక్షలాది మంది ముస్లింలు.. దేశంలో తమ అస్తిత్వం గురించిన భయంతో.. రోడ్డున పడ్డారు. మతంతో నిమిత్తం లేకుండా వారికి మద్దతు పలకడానికి కొందరు వీధుల్లోకి వచ్చారు. మొత్తంగా.. మతపరమైన భయం కలిగిన ముస్లిం సమాజమూ మరియు వారి మద్దతు దారులూ ఎవరో స్పష్టంగా కనిపించింది.
దేశాన్ని విభజించి పాలించడం అనేది బ్రిటిషు వాడు నేర్పించిన మంత్రం అనుకుంటాం గానీ.. అది కేవలం రాజ్యాల ప్రాతిపదికగా జరిగిన వ్యవహారం. కానీ.. అలాంటి విభజించి పాలించే సూత్రానికి నవతరం అప్‌డేట్ వెర్షన్ లాగా మోడీ సర్కారు కనిపిస్తోందనే విమర్శలు సమాజంలో వినిపిస్తున్నాయి. దేశాన్ని మతం ప్రాతిపదికగా రెండు ముక్కలుగా చేసే రకంగా కనిపిస్తోంది. పౌరసత్వం, ఎన్నార్సీ వంటి వాటి ద్వారా సమజంలో కొత్త భయాలు నాటుతున్నారు. కేవలం ముస్లింలను మాత్రం తతిమ్మా సమాజం అనుమానంతో చూసే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
దేశభద్రతకు సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా సరే.. ఎవరూ ఆక్షేపించరు. అర్థం చేసుకుంటారు. ఉగ్రవాదులు దేశంలో చొరబడుతుండవచ్చు. వారు ఒక మతానికి చొరబడిన వారు అవుతుండవచ్చు. అంతమాత్రాన ఆ మతానికి చెందిన వారందరినీ ఒకే గాటన కలిపి వేరుగా చూడడం అనేది మాత్రం అత్యంత ఘోరమైన విషయం.
హైదరాబాదులో కేంద్ర పోకడల పట్ల పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఖర్మం ఏమిటంటే.. వీటిని ముస్లింల ఆందోళనలుగా మీడియా, సమాజం గుర్తిస్తోంది. ఒక పోరాటాన్ని ఒక మతానికి సంబంధించింది మాత్రమే అని గుర్తించడం అంటేనే.. అక్కడితో మోడీషాల పాచిక పారినట్టే. వారు కోరుకుంటున్నది కూడా అదే. సమాజంనుంచి ముస్లింలను వేరు చేయడం. అందుకే ప్రజలందరూ ఈ ఉద్యమాలను ముస్లిం ఉద్యమంగా, ముస్లింల ఆందోళనలుగా చూడడం తప్పు. వీటిని కేవలం ప్రజల ఆందోళనలుగా పరిగణించాలి.
లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి విభజించి పాలించే ధోరణులు ముందు ముందు విభేదాలకు, విద్వేషాలకు, విచ్ఛిన్నానికి కూడా దారి తీస్తాయి.