హైదరాబాద్ లో భారీ వర్షాలకు తలబొప్పి కట్టిన కేసీఆర్ కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చిపడింది. కేసీఆర్ మానస పుత్రికగా భావించే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్ తేల్చిచెప్పింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తీర్పు వెలువరించిన ఎన్జీటీ.. పర్యావరణ అనుమతుల్ని తుంగలో తొక్కి కాళేశ్వరం నిర్మించారని స్పష్టం చేసింది. అయితే ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తి అయింది కాబట్టి.. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
తాగునీటి అవసరాల కోసమని ప్రాజెక్ట్ మొదలుపెట్టి, సాగునీటి కోసం మార్చేశారని, విస్తృత ప్రయోజనాలు ఉన్నా కూడా పర్యావరణాన్ని పక్కన పెట్టలేమని, అతిక్రమణలు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది ట్రైబ్యూనల్. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణం రెండూ కలసి ఉండాలని తేల్చి చెప్పిన ఎన్జీటీ.. అనుమతులపై కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.
పర్యావరణ ప్రభావంపై తీసుకోవాల్సిన చర్యల కోసం ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. నెల రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయాలని, ఆరు నెలల్లోగా నివేదిక అందించాలని.. నిర్వాసితుల పరిహారం, పునరావాసంపై అధ్యయనం చేయాలంది. ఈ కమిటీ పనితీరు పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి పర్యవేక్షించాలని తీర్పు చెప్పింది.
చివరిగా పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ విస్తరణపై ముందుకు వెళ్లొద్దని కేసీఆర్ ప్రభుత్వానికి హరిత ట్రైబ్యునల్ ఆదేశాలిచ్చింది. అయితే ఇక్కడ కొసమెరుపేంటంటే.. ఇటీవల అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు డీపీఆర్ సమర్పించి కేంద్రం నిర్ణయం తీసుకుంటే ప్రాజెక్ట్ పై తమకేం అభ్యంతరాలు లేవంటూ మెలికపెట్టింది ఎన్జీటీ. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విస్తరణ, భవిష్యత్తు కేంద్రం చేతుల్లోకి వెళ్లాయన్నమాట.
ఇటీవలే.. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తెలంగాణ ప్రాజెక్ట్ లపై ఏపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్జీటీ తీర్పు తెలంగాణకు శరాఘాతమే. అందులోనూ.. కేసీఆర్ ను తీసుకెళ్లి నేరుగా మోదీ బోనులో పెట్టింది హరిత ట్రైబ్యునల్. డీపీఆర్ చూసి, కేంద్రం ఓకే అంటే.. మాత్రం ఇబ్బంది లేదంటోంది.
ఈ నేపథ్యంలో తన మానస పుత్రిక అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం వద్ద కేసీఆర్ చేతులు కట్టుకుని నిలబడతారా..? లేక ఎప్పట్లానే తాడోపేడో తేల్చుకునే వైఖరితో ముందుకెళ్తారా అనేది చూడాలి.
అసలే వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రంతో కయ్యానికి దిగారు కేసీఆర్. ప్రతిపక్షాలతో కలసి నానా హంగామా చేశారు. తెలంగాణ నుంచి ఢిల్లీ గద్దెపైకి సవాళ్లు విసురుతున్నారు. అన్నీ బాగానే ఉన్నా.. ఇలాంటి విషయాల్లో మోదీ చండశాసనుడనే పేరుంది. ఎవర్ని, ఎక్కడ, ఎలా తనవైపు తిప్పుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి మోదీ.
ఇప్పుడు కేసీఆర్ ఆయన చేతికి చిక్కితే వదిలిపెడతాడా? కాళేశ్వరం భవిష్యత్ కి మోదీ ఎలాంటి ముగింపు చెబుతారనేది ఇప్పుడు కేసీఆర్ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.