వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి తన సమాధానం ఇచ్చారు. అనుచితంగా మాట్లాడటం, శాపాలు పెట్టడం, చావులు కోరుకోవడం మంచిది కాదంటూ హితబోధ చేసిన తెలకపల్లి రవి పై రఘురామకృష్ణం రాజు ఫైర్ అయిపోయిన నేపథ్యంలో, ఆ సీనియర్ జర్నలిస్టు సున్నితంగా స్పందించారు. మీరేం మాట్లాడారో ఒకసారి మీరే విని, ఆ తర్వాత స్పందించాల్సిందని చురకలంటించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవలే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నుంచి రఘురామకృష్ణంరాజును తప్పించడంపై ఆయన స్పందించారు. ఆ సమయంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీ సీఎం జగన్ ను ఆ హోదా నుంచి తప్పిస్తారని, అప్పుడు ఎన్ని గుండెలు ఆగుతాయో, ఓదార్పు యాత్రలు చేయాలో.. అన్నట్టుగా వ్యాఖ్యానించారు ఆ ఎంపీగారు!
రఘురామకృష్ణంరాజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పడకపోతే ఏ విమర్శలు అయినా చేసుకోవచ్చు కానీ.. అలా చావులను కాంక్షించడం మంచిది కాదంటూ తెలకపల్లి రవి తన యూట్యూబ్ చానళ్లో విశ్లేషించారు. సవాలక్ష రాజకీయ అంశాల గురించి ఆయన తన యూట్యూబ్ చానళ్లో స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన రఘురాజు కామెంట్లలోని అనుచితమైన అంశాలను ఎండగట్టారు.
దీంతో ఎంపీగారికి కోపమొచ్చింది. తెలకపల్లి రవి మీద తీవ్రంగా స్పందించారు. అక్కసు వెల్లగక్కారు. ఘాటైన కామెంట్లు చేశారు. తను అనలేదంటూ అడ్డగోలు వాదన చేశారు. దీనిపై తెలకపల్లి స్పందించారు.
'మీరు మాట్లాడిందేమిటో మరోసారి చూసుకోండి, అన్ని విషయాలపై స్పందించినట్టుగానే మీ విషయంలోనూ స్పందించాను, అనుచితమైన మాటలను ఖండించాను, మళ్లీ మీరు ఛాలెంజ్ లు చేయడం ఏమిటి?' అని తెలకపల్లి తాజా వీడియోలో ప్రశ్నించారు.