కరోనా తగ్గుముఖం పట్టిందని అతి విశ్వాసానికి పోవద్దని హితబోధ చేశారు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ. జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. కరోనా విషయంలో మోడీ స్పందించారు. కరోనా కట్టడిలో భారతదేశం గట్టిగా పని చేసిందని, ప్రభుత్వాలు బాగా స్పందించాయని.. వైద్యుల, నర్సుల సేవాభావంతో వ్యవహరించారని మోడీ కొనియాడారు. అయితే అప్పుడే కరోనా అంతమైపోలేదనే విషయాలను గుర్తించాలని మోడీ నొక్కి చెప్పారు.
పండగల వేళ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దసరా, దీపావళి పండగలు వరసగా ఉన్నాయి. కరోనా నియంత్రణ చర్యలన్నీ ఈ సందర్భంగా కొనసాగించాలని మోడీ సూచించారు. కరోనా నిరోధంలో మాస్కులు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని ధరించాలని మోడీ పేర్కొన్నారు. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించవద్దని మోడీ సూచించారు.
నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి సంపన్న దేశాలు మూల్యం చెల్లించాయని ఇండియాలో అలాంటి పరిస్థితి రానివ్వవద్దని మోడీ హితబోధ చేశారు. పండగల వేళ అని ప్రత్యేకంగా మోడీ ప్రస్తావించారు. 'కరోనా ఉంటేనేం.. హిందూ పండగలు చేసుకోవద్దా?' అంటూ అతిగా స్పందించే వీర హిందుత్వవాదులు కనీసం ప్రధాని మోడీ మాట అయినా విని కాస్త వెనక్కు తగ్గుతారని ఆశించవచ్చు. పండగను ఎవరింట్లో వాళ్లు ఉండి చేసుకుంటే అందరికీ మంచిది.
మహారాష్ట్ర గవర్నర్ ఆలయాలను ఎందుకు తెరవడం లేదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి పెద్ద దుమారం రేపారు. కనీసం అలాంటి వాళ్లకు మోడీ ప్రసంగంలోని హితబోధ అర్థం అయితే చాలేమో!