ప్రజా ఆగ్రహ సభలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన మిత్రుడైన జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మిగిలిన ప్రతిపక్షాలపై విమర్శలు చేసినట్టే, మిత్రపక్షమైన జనసేనపై కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నోరు పారేసుకోవడంపై జనసేన ఆగ్రహంగా ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ మిత్రుడైన పవన్‌కల్యాణ్ ఉద్యమిస్తున్నట్టుగానే, స్పిన్నింగ్ మిల్లులు, చక్కెర ప్యాక్టరీలు, పాల ప్యాకర్టీలు మూసివేతకు నిరసనగా కూడా పోరాడాలని పవన్‌కు హితవు చెప్పడం గమనార్హం. సోము వీర్రాజు హితవును జనసేన జీర్ణించుకోలేకుంది.
సోము వీర్రాజు వ్యాఖ్యలపై జనసేన జనరల్ సెక్రటరీ శివశంకర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ, జనసేన అంటీముట్టనట్టుగా ఉన్నాయనే విమర్శలకు సోము వీర్రాజు విమర్శలు ఊతం ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. సోము వీర్రాజు ఎమోషనల్‌గా లూజ్ అయి మాట్లాడారని అన్నారు. గతంలో కూడా ఆయన అలాగే మాట్లాడారని శివశంకర్ చెప్పుకొచ్చారు. నిన్న బహిరంగ సభలో కూడా అట్లే మాట్లాడారని గుర్తు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ పోరాటంపై సోము వీర్రాజు కామెంట్స్ చేస్తూ వేరే విషయాలు ప్రస్తావించారని శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆ సమయంలో మీరు (సోము) ఎమ్మెల్సీగా ఉన్నారు కదా? తమరేం చేశారు? తమరు కూడా బాధ్యతగల ప్రతిపక్షంలో ఉన్నారు కదా! మాట్లాడాలంటే ఇలాంటి చిట్టా చాలా వస్తుందని శివశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోము వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే విడిచి పెడుతున్నట్టు జనసేన నాయకుడు అన్నారు.
భావోద్వేగంతో ఆయన అలా మాట్లాడి ఉంటారని అనుకుంటున్నామన్నారు. ఏదో ప్రస్ట్రేషన్‌లో ఉంటారన్నారు. ఆ సందర్భంలో మాటలు దొర్లుతుంటాయన్నారు. ఆ ప్రస్ట్రేషన్ ఏంటో ఆయనకే తెలుస్తుంటుందన్నారు. పవన్‌కల్యాణ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదని జనసేన జనరల్ సెక్రటరీ సంచలన వ్యాఖ్య చేశారు. బహుశా సోము వీర్రాజుకు ఆ లాజిక్ అర్థం కాలేదన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ మిగిలిన పరిశ్రమల లాంటిది కాదని, దీనికి ప్రత్యేక సెంటిమెంట్ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి పవన్ తీసుకెళ్లారన్నారు. కావున దీన్ని ప్రైవేటీకరణ నుంచి తప్పించి ఆదుకోవాలని పవన్ విన్నవించారని శివశంకర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ అదే చెబుతున్నారని ఆయన తెలిపారు.
వైసీపీ ప్రభుత్వాన్ని అఖిలపక్షం ఏర్పాటు చేయాలని పవన్ అడిగితే, సోము వీర్రాజుకు ఎక్కడ గుచ్చుతున్నదో అర్థం కావడం లేదన్నారు. పవన్‌కల్యాణ్ అది ప్రశ్నించరు, ఇది ప్రశ్నించరని సోము వీర్రాజు అడగడం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాయకుడి బాధ్యతా రాహిత్యమని తప్పు పట్టారు. రాజకీయాల్లో కొద్దిగా నైనా విలువలతో వెళ్లాలని సూచించారు. మైకు దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడని సోము వీర్రాజుకు ఆయన హితవు చెప్పారు. అది మన స్థాయిని తగ్గిస్తుందని, శోభనివ్వదని చెప్పుకొచ్చారు.
తాము పొత్తు ధర్మాన్ని త్రికరణ శుద్ధితో పాటిస్తున్నామన్నారు. బీజేపీ నేతలు కూడా పాటిస్తున్నారన్నారు. పవన్‌కల్యాణ్ విషయంలో సోము వీర్రాజు నోరు జారుతున్నారని ఆయన అనడం గమనార్హం.