ఒకరిద్దరు బాగుపడితే కులం అంతా బాగుపడినట్లా? అన్నది కాపు కుల సంభవుడు, కాపులు తనను ఆదరించాలని, గతంలో అలా ఆదరించలేదని సదా బాధపడుతున్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రశ్న. కేవలం పదివేల మంది బిసి లకో, కాపులకో సాయం చేస్తే ఆ కులపోళ్లు అంతా బాగుపడినట్లేనా? అన్నది మరో ప్రశ్న. మరి అదే ప్రశ్న పవన్ కళ్యాణ్ ను అడిగితే..
అసలు మీరు మీ అన్నదమ్ములు కలిసి ఎంత మంది కాపులను, బిసి లను హీరోలను చేసారు? మీరు అన్న దమ్ములు, మేనలుళ్లు తప్ప మరొకరిని వెదికి వెదికి పట్టుకుని చేరదీసి ఎంకరేజ్ చేసారా? అంతెందుకు మీ కజిన్లు, దూరపు చుట్టాలు హీరోలుగా ట్రయ్ చేసిన సందర్భాలు వున్నాయి. అప్పుడు మీరు ఏపాటి సాయం అందించారు? దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ లాంటి వాళ్లు కాపులకు చేసిన సాయంలో పదో వంతు అయినా మీరు మీ అన్నదమ్ములు చేసారా?
కాపుల్లో మీకు సరిసాటి వారు లేరనే కదా వేరే అగ్ర కులాల సంబంధాలు చేసుకున్నది. చేసుకున్న కాపు అమ్మాయిని అమాంతం వదిలేసి, వేరే వేరే అమ్మాయిల్ని వెదికి చేసుకున్నపుడు కాపులు గుర్తుకు రాలేదా. కాపుల అభిమానం అనే పునాదుల మీదే కదా మీరు, మీ మెగా హీరోలు అంతా ఎదిగింది. మీకు మినిమమ్ మార్కెట్ ఆ విధంగా వుంది అనే కదా? నిర్మాతలు మీ చుట్టూ తిరిగేది?
ఈ విషయంలో మీ అన్న దమ్ముల కన్నా అల్లు అరవింద్ బెటర్ అని ఇండస్ట్రీలోనే చెప్పుకుంటారు కదా? కాపులను చేరిదీసి అవకాశాలు ఇచ్చి, ఎదిగేలా చేయడంలో అరవింద్ ముందు వుంటారని అంతా చెప్పుకుంటారు. మరి మీ గురించి అలా ఎందుకు చెప్పుకోరు? మనం ఎప్పుడూ కమ్మవారితో వుంటేనే మనకు సేఫ్ అని చెప్పి మరీ మెగాస్టార్ కమ్మ నిర్మాతలకే ఎక్కువ డేట్ లు ఇచ్చేవారని అలనాటి సీనియర్ నిర్మాతలు ఇప్పటికీ కథలు కథలుగా చెబుతారు. ఆ రోజుల్లోనే మా అమ్మాయికి ఓ మాంచి సంబంధం వుంటే చూడండి మీ వాళ్లలో అని మెగాస్టార్ ఓ సీనియర్ రెడ్డి నిర్మాతను అడిగారని టాక్ వుంది.
అసలు సినిమా రంగంలో మీ చుట్టూ వున్న కాపులు ఎంత మంది? అసలు కాపు నిర్మాత ను సినిమా చేయకుండా నాన్చుతూ, నానా బాధ పెడుతూ మిగిలిన సినిమాలు చేస్తున్నది ఎవరికి? సరే సినిమాల సంగతి అలా వుంచుందాం. రాజకీయాల్లో మీరేం చేసారు. మాంచి పేరున్న కాపునేతను ఎవరినైనా తీసుకువచ్చి పార్టీ పగ్గాలు అందించారా? లేదుగా… కమ్మ కులానికి చెందిన నాదెండ్లను నమ్మారు. అన్న దమ్ముడిని తోడు తీసుకున్నారు తప్ప కాపు నాయకులను ఎవరినైనా చేరదీసారా?
కాపులు నాకు ఓటేయలేదు..నోరు మంచిగా వుండాలి అంటూ సుద్దులు చెప్పే మీరు నోరు ఎంత మంచిగా వుంది. తొక్క తీస్తా..తోలు తీస్తా..పంచెలూడదీసి కొడతా..ఇదే కదా మీ నోరు? మీరు ఎంత మందితో మంచిగా వుంటున్నారు? మరి మీరు ఎలా సుద్దులు చెప్పగలరు?
అసలు సింగిల్ ఆన్సర్ చెప్పండి జగన్ అంటే మీకు ఎందుకు ద్వేషం?
సరే ఇప్పుడు నాలుగేళ్లుగా పవర్ లో వున్నారు కనుక, బాగా పాలించడం లేదు. అందుకు ద్వేషం అని చెప్పగలరేమో? మరి 2014 లో ఎందుకు ద్వేషం. అప్పటికి అధికారంలో లేరుగా జగన్? చంద్రబాబు పాలన మీరు చూసి వున్నారుగా? చంద్రబాబు మీద ఇష్టం వుండొచ్చు అప్పటికి. కానీ ద్వేషం ఎందుకు? అంటే మీ కన్నా చిన్న వాడైనా, మీకన్నా రాజకీయాల్లో దూసుకుపోతున్నాడని అసూయ. అంతకన్నా ఏముంది రీజన్ మీ దగ్గర?
కానీ మీరు మాత్రం కాపు నాయకులను తిడతారు. పని గట్టుకుని టార్గెట్ చేస్తారు. గంటా, కన్నబాబు లాంటి ప్రజారాజ్యం నాయకులు మీకు కిట్టరు. పార్టీ అమ్మిన అన్న, మంత్రి పదవి తీసుకున్న అన్న తో బాగానే వుంటారు. కానీ వీళ్లే ఏదో పార్టీ అమ్మించినట్లు గంటా, కన్నబాబులపై ఒంటికాలితో లేస్తారు?
ఇలా రాసుకుంటూ, ప్రశ్నించుకుంటూ పోతే ఎంతో వుంది. కానీ మీకు మాత్రం కాపులు ఓట్లు వేయాలి. సినిమా రంగంలో ఎదగడానికి పల్లకీ మోసినట్లే రాజకీయ రంగంలో కూడా కాపులు మోయాలి. నిజానికి మోస్తారు. అందుకు సిద్దంగానే వున్నారు. కానీ పల్లకీలో మీరు కూర్చొకుండా చంద్రబాబును కూర్చోపెడతాం అంటున్నారు. అందుకే కాపులు మీకు దూరం అవుతున్నారు. అది గమనించుకోండి ముందు.