ఆర్ఆర్ఆర్ లో నాటు-నాటు సాంగ్ కు ఆస్కార్ వచ్చింది. ఆ సినిమా యూనిట్ పండగ చేసుకుంటోంది. అవార్డ్ అందుకున్న కీరవాణి-చంద్రబోస్ తో పాటు చరణ్-తారక్, రాజమౌళి ఇలా అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అటు ఇండస్ట్రీతో పాటు, ఇండియా మొత్తం ఈ ఆస్కార్ ను సెలబ్రేట్ చేసుకుంటోంది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఓ కీలకమైన వ్యక్తి మిస్సయ్యాడు. అతడే ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓ విధంగా ఆదిపురుషుడు దానయ్య. ఇతడు డబ్బులు పెట్టకపోతే ఈ సినిమా కార్యరూపం దాల్చేది కాదు. ఇలాంటి కీలకమైన వ్యక్తిని, ఆస్కార్ అందుకున్న వేళ రాజమౌళి అండ్ కో విస్మరించింది.
నిజానికి దానయ్యను 'పక్కనపెట్టే' వ్యవహారం చాన్నాళ్ల కిందటే మొదలైంది. ఎప్పుడైతే ఆస్కార్ అవార్డుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాను పంపించారో, అప్పట్నుంచే వ్యూహాత్మకంగా డీవీవీని సైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆస్కార్ గెలిచిన వేళ, ఈ సైడ్ చేసే కార్యక్రమం పీక్ స్టేజ్ కు చేరుకుంది.
ఇక్కడ బాధాకరమైన విషయం ఇంకోటి ఉంది. ఆర్ఆర్ఆర్ యూనిట్ కు దేశం మొత్తం అభినందనలు తెలుపుతోంది. కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి, చరణ్, తారక్.. ఇలా చాలామందిని ట్యాగ్ చేస్తున్నారు ప్రముఖులు. కానీ ఈ ట్యాగ్స్ లో ఎక్కడా డీవీవీ దానయ్య లేదా డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ కనిపించడం లేదు. చివరికి అన్నీ తెలిసిన ఇండస్ట్రీ వ్యక్తులు కూడా దానయ్యను ట్యాగ్ చేయడం లేదు.
అటు డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ హ్యాండిల్ మాత్రం ఇలా ట్విట్టర్ లో వస్తున్న పోస్టులన్నింటినీ షేర్ చేస్తోంది. ప్రముఖులకు తమ తరఫున కృతజ్ఞతలు తెలుపుతోంది. ఇదంతా చూస్తుంటే ఎలా ఉందంటే, 'నేను కూడా ఉన్నాను, గుర్తించండి మహాప్రభో' అని దానయ్య వేడుకుంటున్నట్టుంది.
ఆస్కార్ ఎంట్రీ కోసం ఖర్చు నిర్మాత పెట్టలేదని, స్వయంగా రాజమౌళితో పాటు మరో 'ఇద్దరు' కీలక వ్యక్తులు ఈ వ్యవహారం మొత్తం చూసుకున్నారని, అందుకే దానయ్యను పక్కనపెట్టారంటూ గతంలో కథనాలు వచ్చాయి. అవి నిజమా కాదా అనే విషయం పక్కనపెడితే, ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నప్పుడు నిర్మాతను గుర్తుచేసుకోవడం కనీస ధర్మం. అవార్డ్ ను అంతా క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు నిర్మాతకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వడంలో తప్పులేదు కదా.
దానయ్యకు వచ్చిన ఈ పరిస్థితి చూసి ఇండస్ట్రీలోనే చాలామంది జాలిపడుతున్నారు. ఇంత పెద్ద గుర్తింపు వచ్చినప్పుడు కనీసం నిర్మాత పేరును ఎవ్వరూ ప్రస్తావించకపోవడం బాధాకరమంటూ కొంతమంది చర్చించుకోవడం కనిపిస్తోంది.