ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వాలన్న కేసీఆర్ సర్కార్ విజ్ఞప్తిపై సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చడం గమనార్హం. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ విచారిస్తుందని నిర్ధారణ అయ్యింది. ఈ విషయంలో కేసీఆర్ సర్కార్ తీవ్ర నిరాశకు గురి అవుతోంది.
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి సానుకూల తీర్పు వచ్చింది.
దీంతో కేసీఆర్ సర్కార్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ ధర్మాసనం విచారించింది. ఇప్పటి వరకు సీబీఐ కేసు నమోదు చేయలేదని, కేసు వివరాలు కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్ని సార్లు లేఖరాసినా స్పందించలేదని బీజేపీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు సీబీఐ విచారణ జరపకుండా స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను జులై 31కి వాయిదా వేసింది. దీంతో ఆశించిన తీర్పు దక్కకపోవడంతో తెలంగాణ సర్కార్ తీవ్ర నిరాశకు గురైంది.