జ‌గ‌న్‌ను క‌ట్ట‌డి చేయండి మ‌హాప్ర‌భో!

క్షేత్ర‌స్థాయిలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోడం అసాధ్య‌మ‌ని చంద్ర‌బాబునాయుడికి అర్థ‌మైంది. ఇంత‌కాలం పోల్ మేనేజ్‌మెంట్‌లో చంద్ర‌బాబు పే…ద్ద తోపు అని, ఆయ‌న్ను ఢీకొట్టే వారే లేర‌ని 2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ ప్ర‌చారంలో వుండేది.…

క్షేత్ర‌స్థాయిలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోడం అసాధ్య‌మ‌ని చంద్ర‌బాబునాయుడికి అర్థ‌మైంది. ఇంత‌కాలం పోల్ మేనేజ్‌మెంట్‌లో చంద్ర‌బాబు పే…ద్ద తోపు అని, ఆయ‌న్ను ఢీకొట్టే వారే లేర‌ని 2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ ప్ర‌చారంలో వుండేది. అయితే 2019 ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న చంద్ర‌బాబును వైసీపీ అధినేత‌, నాటి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ క‌ట్ట‌డి చేయ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ త‌ర్వాత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు.

జ‌గ‌న్ పాల‌న‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎలా జ‌రిగాయో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే చంద్ర‌బాబు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో సైతం టీడీపీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకుంది. దీంతో ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డం అంత సులువైన ప‌నికాద‌ని చంద్ర‌బాబుకు తెలిసొచ్చింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక‌, ప‌ట్ట‌భ‌ద్ర‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ఎన్నిక‌లంటే ఓ యుద్ధ‌మ‌నే చెప్పాలి. విజ‌యం త‌ప్ప‌, నీతి, నిజాయ‌తీల‌కు చోటు వుండ‌దు. ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలిసినంత‌గా మ‌రే నేత‌కు తెలియ‌దు. కానీ వైసీపీని ఎన్నిక‌ల్లో ఎదుర్కోవ‌డం మానేసి, ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదులు చేయ‌డానికి చంద్ర‌బాబు ప‌రిమితం అయ్యారు. దీంతో ఆయ‌న నిస్స‌హాయ స్థితిని అర్థం చేసుకోవ‌డం త‌ప్ప‌, చేయ‌గ‌లిగిందేమీ లేదు. ఇప్ప‌టికే దొంగ ఓట్ల‌పై జాతీయ ఎన్నిక‌ల అధికారికి చంద్ర‌బాబు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇవాళ మ‌రోసారి ఆయ‌న సీఈసీకి ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌పై ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని వైసీపీ తీవ్రంగా ఉల్లంఘిస్తూ, ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తోంద‌ని చంద్ర‌బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తిలో తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దివిన విజ‌య అనే మ‌హిళ గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో అక్ర‌మ ఓటు వేశార‌ని ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఆయ‌న కుమారుడైన డిప్యూటీ మేయ‌ర్‌ అభిన‌య్‌రెడ్డి పోలింగ్ కేంద్రాల్లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇదే సంద‌ర్భంలో టీడీపీ నేత‌ల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని పోలీసుల‌పై ఒత్తిడి తెచ్చిన‌ట్టు ప్ర‌స్తావించారు. బోగస్ ఓట్లపై ప్రశ్నించిన టీడీపీ నేత దేవనారాయణరెడ్డి, పులిగోరు ముర‌ళీల‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.  

వైసీపీ అక్ర‌మాల‌కు సంబంధించి ఆధారాల‌తో స‌హా పంపుతున్నామ‌ని, వాటిపై చ‌ర్య‌లు తీసుకుని ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని చంద్ర‌బాబు వేడుకున్నారు. ఇంత‌కంటే చంద్ర‌బాబుకు మ‌రో మార్గ‌మే క‌నిపించ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో మాత్రం జ‌గ‌న్‌ను ఎదుర్కోలేమ‌ని టీడీపీ శ్రేణులు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాయ‌ని తాజా ఎన్నిక‌ల స‌ర‌ళి చెబుతోంది.