తిరుపతిలో వైసీపీని ఎదుర్కోవడంలో స్థానిక నాయకత్వం మరోసారి విఫలమైంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన తనయుడు అభినయ్ దూకుడును అడ్డుకోవడంలో అక్కడి టీడీపీ నాయకులు పూర్తిగా చేతులెత్తేశారు. పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు ఎక్కించారని టీడీపీతో పాటు వామపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి.
ఎన్నికల రోజు దొంగ ఓటర్లను అడ్డుకుంటామని, వైసీపీ ఆగడాలను నిలువరిస్తామని టీడీపీ, వామపక్ష నేతలు ప్రగల్భాలు పలికారు. ఇవాళ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి తిరుపతిపై పడింది. అక్కడ ఎన్నిక ఏ విధంగా జరుగుతుందోననే ఉత్కంఠ నెలకుంది. అయితే తిరుపతిలో ఎన్నికలు సాఫీగా సాగుతున్నాయి. ఎల్లో మీడియా ప్రతినిధుల హడావుడి తప్ప, ప్రతిపక్ష నేతల అలికిడి కరువైంది.
ముఖ్యంగా తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కేవలం మొక్కుబడిగా పోలింగ్ కేంద్రాలను సందర్శించడం గమనార్హం. లోకేశ్‌పై కోపంతో ఆమె ఈ ఎన్నికలను సీరియస్‌గా పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది. ఇటీవల పాదయాత్రలో భాగంగా నగరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, పుంగనూరు, సత్యవేడు తదితర నియోజకవర్గాల అభ్యర్థులను లోకేశ్ ప్రకటించారు. తిరుపతి విషయంలో మాత్రం లోకేశ్ దాటవేత ధోరణి ప్రదర్శించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆమె అనుచరులు లోకేశ్‌పై రగిలిపోతున్నారు.
మొదటి నుంచి పార్టీని భుజాన మోస్తున్న తమను కాదని, మరెవరికో టికెట్ ఇచ్చే ఆలోచన ఉందని తెలిసి, తామెందుకు పని చేస్తామని సుగుణమ్మ, ఆమె అనుచరులు అంటున్నట్టు తెలిసింది. అందుకే తాము పట్టించుకోకపోతే తిరుపతిలో టీడీపీ పరిస్థితి కుక్కలు చించిన విస్తరి అని నిరూపించేందుకు సుగుణమ్మ వ్యూహాత్మకంగా నడుచుకున్నారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించడానికే మాత్రమే ఆమె పరిమితం అయ్యారు.
అలాగే సంజయ్‌కాలనీకి సుగుణమ్మ వెళ్లినప్పుడు వైసీపీ శ్రేణులు చుట్టుముట్టడం తదితర ఘటనలన్నీ అధికార పార్టీతో ముందస్తు మాట ప్రకారమే జరిగిందనే ప్రచారం తిరుపతిలో విస్తృతంగా సాగుతోంది. తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి, ఆయన తనయుడు అభినయ్‌ని ఎదుర్కోడంలో సుగుణమ్మ శక్తి సరిపోదని మొదటి నుంచి చంద్రబాబు భయపడుతున్నట్టే, ఇవాళ కూడా అదే జరిగింది. దీంతో తిరుపతిలో వైసీపీని ఢీకొట్టేందుకు బలమైన నాయకత్వాన్ని ఎదుర్కోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది.