దేశీయంగా మీటూ ఉద్యమానికి ఊపును ఇచ్చిన లేడీ సెలబ్రిటీ తనూశ్రీ దత్తా. అమెరికా వెళ్లిపోయి సెటిలైన ఈ హీరోయిన్ ఉన్నట్టుండి ఇండియాకు వచ్చి మీ టూ మంటలు రేపింది. అంతకు పదేళ్ల కిందట తను ఎదుర్కొన్న సెక్సువల్ వేధింపుల గురించి వివరించింది. దేశంలోనే అత్యంత ప్రముఖ నటుడిగా పేరున్న నానా పటేకర్ ను బుక్ చేసింది తనూశ్రీ. ఈ హీరోయిన్ ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా అనేక మంది మీ టూ అన్నారు. ఆ దెబ్బతో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తన పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.
ఇలా రేగిన మీ టూ సెగలను మొదలుపెట్టింది తనూశ్రీ దత్తానే. అయితే ఆమె చేసిన ఆరోపణలు ఇప్పటి వరకూ ఎడతెగలేదు. ఆమె చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని అంటున్నారు ముంబై పోలీసులు. అయితే కోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ మాత్రం కొనసాగుతూ ఉంది.
అయితే ఇప్పుడు ప్రహసనం ఏమిటంటే.. ఈ కేసులో తనూశ్రీ తరఫున వాదిస్తున్న లాయర్ లైంగిక వేధింపుల కేసులో బుక్ అయ్యాడు. మీటూ కేసులో తనూశ్రీ తరఫున వాదిస్తున్న లాయర్ నితిన్ సత్పుతే.. తనను వేధించాడంటూ ఒక 47 యేళ్ల మహిళ ఆరోపించింది. అందుకు ఆధారాలను ఆమె పోలీసులకు సమర్పించింది. అతడిపై కేసును నమోదు చేశారు పోలీసులు!
ఏ కేసు అయితే దేశంలో మీటూ ఉద్యమానికి ఆజ్యం పోసిందో.. అదే కేసులో లాయర్ ఇప్పుడు అదే తరహా ఆరోపణలతో బుక్ కావడం విడ్డూరమో. మరి ఇప్పుడు తనూశ్రీ ఏం చేస్తుందో.. తన ఫిర్యాదుకు అనుగుణంగా కొత్త లాయర్ ను నియమించుకుంటుందా? మరో లాయర్ విషయంలో అయినా తనూశ్రీ ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలేమో!