పేరు మార్చుకున్న హీరో.. ప‌రిస్థితి మెరుగ‌వుతుందా?

న్యూమ‌రాల‌జీకి అనుగుణంగానో.. మ‌రో సెంటిమెంట్ తోనో చాలా మంది సెల‌బ్రిటీలు త‌మ పేరును మార్చుకుంటూ ఉంటారు. పేరును పూర్తిగా మార్చేసుకోవ‌డం కాదు.. కొద్దిగా స్పెల్లింగ్ ను మార్చుకోవ‌డం. ఈ జాబితాలో చాలా మంది ప్ర‌ముఖులు…

న్యూమ‌రాల‌జీకి అనుగుణంగానో.. మ‌రో సెంటిమెంట్ తోనో చాలా మంది సెల‌బ్రిటీలు త‌మ పేరును మార్చుకుంటూ ఉంటారు. పేరును పూర్తిగా మార్చేసుకోవ‌డం కాదు.. కొద్దిగా స్పెల్లింగ్ ను మార్చుకోవ‌డం. ఈ జాబితాలో చాలా మంది ప్ర‌ముఖులు ఉన్నారు. త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత‌, క‌ర్ణాట‌క ప్ర‌స్తుత సీఎం య‌డియూర‌ప్ప త‌దిత‌రులున్నారు. జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఒక ద‌శ‌లో త‌న పేరు ఇంగ్లిష్ స్పెల్లింగ్ ను మార్చుకున్నారు.

ఇక ఇప్పుడు ఇదే జాబితాలోకి చేరాడ‌ట మ‌ల‌యాళీ హీరో దిలీప్. త‌న సినిమాల‌తో కాకుండా.. గ‌త కొన్నాళ్లుగా తీవ్ర‌మైన వివాదాల‌తో దిలీప్ వార్త‌ల్లోకి ఎక్కాడు. ఒక న‌టిపై దాడి కేసులో కొన్నాళ్లు జైల్లో కూడా ఉండివ‌చ్చాడు. ఇప్పుడు ఆ కేసులో బెయిల్ పొంది సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు ఈ న‌టుడు. ఈ నేప‌థ్యంలో ఇత‌డు త‌న పేరును మార్చుకున్నాడ‌ట‌. పేరు పూర్తిగా కాదు కానీ, ఇంగ్లిష్ స్పెల్లింగ్ ను మార్చుకున్నాడ‌ట దిలీప్.

ఇన్నాళ్లూ ఇత‌డి పేరుకు Dileep అని స్పెల్లింగ్ రాసుకునేవాడు. ఇక నుంచి Dilieep అని రాసుకుంటాడ‌ట‌. గ‌త కొన్నాళ్లుగా దిలీప్ తీవ్ర‌మైన ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాడు. బ‌హుశా ఆ ఇబ్బందుల‌న్నీ తీరిపోవ‌డానికి ఇలా  పేరుకు సంబంధించి ఇంగ్లిష్ స్పెల్లింగ్ ను మార్చుకున్నాడేమో!