భారీ యాక్సిడెంట్ తర్వాత మూతపడిన బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ను తిరిగి తెరిచారు. హైదరాబాద్ లోని ఐటీ కార్యాలయాల మధ్య ఏర్పాటైన ఈ ఫ్లై ఓవర్ పై నవంబర్ లో పెద్ద ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ మీద నుంచి ఓ కారు అదుపుతప్పి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. అంతకంటే ముందు సెల్ఫీ తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తుల్ని కారు ఢీకొట్టింది.
ఇలా వరుస ఘటనలతో ఫ్లై ఓవర్ ను మూసేశారు. బ్రిడ్జి డిజైన్ లో లోపం ఉందని, భూసేకరణలో రాజీ పడడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణుల కమిటీ తేల్చింది. వాళ్ల సూచనల మేరకు ఫ్లై ఓవర్ కు రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు బిగించారు. స్పీడ్ లిమిట్ ను 40 కిలోమీటర్లకు తగ్గించారు. వేగంగా ప్రయాణిస్తే, ఆటోమేటిగ్గా చలనాలు వెళ్లేలా టెక్నాలజీని ఏర్పాటుచేశారు.
ఇలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన తర్వాత మరోసారి నిపుణుల కమిటీ, ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించి ఇవాళ్టి ఉదయం నుంచి ఫ్లై ఓవర్ ను తిరిగి తెరిచారు. ఇవాళ్టి నుంచి ఓ వారం రోజుల పాటు ప్రమాదకర మలుపుల వద్ద ట్రాఫిక్ పోలీసుల్ని ఉంచాలని నిర్ణయించారు. వాహనాల రాకపోకల్ని, వేగాన్ని గమనించిన తర్వాత పోలీసుల్ని ఉపసంహరిస్తారు.
ఓవర్ స్పీడ్ తో వెళ్లే వాళ్లకు ప్రస్తుతం విధించే జరిమానాను మరింత పెంచాలని నిపుణుల కమిటీ సూచించింది. కానీ ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం హోల్డ్ లో పెట్టింది.