హరిరామజోగయ్య.. పొడవని పొత్తులో పుండు!

పవన్ కల్యాణ్ మరో రెండురోజుల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ ను నిర్వహించబోతున్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఈ సభ చాలా కీలకం అని పార్టీ శ్రేణులంతా అనుకుంటున్నాయి. Advertisement కులం పరంగా కూడా..…

పవన్ కల్యాణ్ మరో రెండురోజుల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ ను నిర్వహించబోతున్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఈ సభ చాలా కీలకం అని పార్టీ శ్రేణులంతా అనుకుంటున్నాయి.

కులం పరంగా కూడా.. కాపు కార్డును భుజాన పెట్టుకుంటే తప్ప లాభం లేదని.. ఆ విషయంలో కాపులందరికీ స్పష్టత ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లుగా కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే  పవన్ కల్యాణ్ కాపు సంక్షేమ సేన సదస్సును నిర్వహించారు. పార్టీలోని కాపులందరిని పిలిచి వారికి కాస్త జోష్ ఇవ్వడం ఈ సదస్సు ఉద్దేశం.

పవన్ కోటరీలో కాపు వృద్ధుడు హరిరామజోగయ్యను కూడా ప్రధానంగా ఆహ్వానించారు. అయితే జోగయ్య మాత్రం.. తెలుగుదేశం పార్టీతో ఇంకా పొడవని జనసేన పొత్తులో పుండు పెట్టేలా మాటలు మాట్లాడడం విశేషం.

జనసేన పార్టీ.. అటు తెలుగుదేశం, ఇటు వైసీపీలో సమానదూరం పాటించాలని, ఆ రెండు పార్టీలను పతనం చేయడానికి సమానంగా ప్రయత్నించాలని హరిరామజోగయ్య సూచించడం బహుశా పవన్ కు మింగుడుపడి ఉండకపోవచ్చు.

చంద్రబాబునాయుడు జనసేనను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని జోగయ్య అనడం విశేషం. కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నాక, చంద్రబాబు హైజాక్ చేసి తెలుగుదేశంలో చేర్చుకున్నారనేది జోగయ్య ఆరోపణ. అలాగే.. జనసేన పార్టీకి రాబోయే ఎన్నికల్లో 20 సీట్లు మాత్రమే ఇవ్వబోతున్నట్లుగా చంద్రబాబునాయుడు బయట ప్రచారం చేస్తున్నారని కూడా జోగయ్య ఆరోపించారు.

స్థూలంగా చెప్పాలంటే.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం, చంద్రబాబు పల్లకీ మోయడానికి పవన్ కల్యాణ్ ఉత్సాహపడుతూ ఉండడం అనేది కేవలం హరిరామజోగయ్యకు మాత్రమే కాదు.. కాపువర్గానికి కూడా ఇష్టం లేని సంగతి అనేది మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు సాక్షిగా నిర్వహించిన ఈ సదస్సులో తేలిపోయింది. 

ఇది పవన్ కల్యాణ్ కు చేదు అనుభవమే. హరిరామజోగయ్య వేసిన బ్రేకుల దెబ్బకు పవన్ కు మైండ్ బ్లాక్ అయింది. మరో రెండు రోజుల్లో తెలుగుదేశంతో పొత్తును ప్రకటించడానికి సిద్ధమవుతూ.. దానికి తన కులాన్ని మొత్తం ట్యూన్ చేయాలని పవన్ ఈ సదస్సు పెడితే అది కాస్తా బ్యాక్ ఫైర్ అయింది.

జోగయ్య చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోను, మీ ఆత్మగౌరవాన్ని తగ్గించను, ప్రాక్టికల్ గా వ్యవహరిస్తా.. లాంటి మాటలు చెప్పి.. ‘పొత్తులు ఖరారుగా ఉంటాయి’ అనే మాట తప్ప  ‘మరీ 20 సీట్లకు ఒప్పుకోను లెండి, మరికాస్త ఎక్కువ అడుగుదాం’ అన్నట్టుగా పవన్ మాట్లాడాల్సి వచ్చింది.

మొత్తానికి జనసేన కాపుల్లోని అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం ద్వారా.. హరిరామజోగయ్య.. తెలుగుదేశం జనసేన మధ్య ఇంకా మొదలుకాని పొత్తు బంధంలో అప్పుడే పుండుపెట్టేశారు.