రాష్ట్ర బంద్ చేయ‌క‌, ఈ రాజ‌ధాని బందేంటి చంద్ర‌బాబు!

'అమ‌రావ‌తి 29 గ్రామాల స‌మస్య కాదు.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల స‌మ‌స్య‌..' అని ఒక‌వైపు నిన‌దిస్తూ ఉన్నారు. పాల‌న మొత్తం అమ‌రావ‌తి నుంచే జ‌ర‌గాల‌ని, క‌ర్నూలుకు, విశాఖ‌కు ఎలాంటి వాటాలు ఇవ్వ‌కూడ‌ద‌ని.. డిమాండ్…

'అమ‌రావ‌తి 29 గ్రామాల స‌మస్య కాదు.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల స‌మ‌స్య‌..' అని ఒక‌వైపు నిన‌దిస్తూ ఉన్నారు. పాల‌న మొత్తం అమ‌రావ‌తి నుంచే జ‌ర‌గాల‌ని, క‌ర్నూలుకు, విశాఖ‌కు ఎలాంటి వాటాలు ఇవ్వ‌కూడ‌ద‌ని.. డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర స‌మ‌స్య అని, అమ‌రావ‌తిలోనే అంత జ‌ర‌గ‌డ‌మే రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని చెప్పుకుంటున్నారు. మ‌రి ఈ లెక్క‌న‌.. అమ‌రావతి ఉద్య‌మంలో భాగంగా బంద్ చేయాల‌ని కూడా నిర్ణ‌యించారు. శ‌నివారం రోజున బంద్ కు ముహూర్తాన్ని కూడా ప్ర‌క‌టించారు. అయితే ఎటొచ్చీ ఈ బంద్ అమ‌రావ‌తిలో మాత్ర‌మే అని ప్ర‌క‌టించుకోవ‌డ‌మే కామెడీగా ఉంది.

అమ‌రావ‌తిని రాజ‌ధాని గా కావాలంటూ అమ‌రావ‌తిలో బంద్ చేస్తున్నార‌ట‌. దీనికి తెలుగుదేశం పార్టీతో పాటు జ‌న‌సేన కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింద‌ట‌. అంతే కాద‌.. కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యూఐ కూడా ఈ బంద్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింద‌ట‌. ఇలా వీళ్లంతా క‌లిసి అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఉంచాలంటూ అమ‌రావ‌తిలో బంద్ చేస్తున్నార‌ట‌.

ఇదీ తెలుగుదేశం పార్టీ శ‌క్తి, యుక్తి. రాష్ట్రం కోసం అమ‌రావ‌తి అంటున్న చంద్ర‌బాబు నాయుడు..ఆ అమరావ‌తి కోసం రాష్ట్ర‌మంతా బంద్ ను ప్ర‌క‌టించ‌లేక‌పోయారు. అమ‌రావ‌తి పేరుతో రాష్ట్ర‌మంతా బంద్ చేసి ఉంటే.. అప్పుడు నిజంగానే రాష్ట్రానికి అమ‌రావ‌తి అవ‌స‌రం ఉంద‌ని తెలుగుదేశం పార్టీ రుజువు చేయ‌గ‌లిగేది. అమ‌రావ‌తి కోసం అమ‌రావ‌తిలో మాత్ర‌మే బంద్ చేస్తున్నారంటే, అమ‌రావ‌తి అవ‌స‌రం అమ‌రావ‌తికే త‌ప్ప‌.. మ‌రెవ‌రికీ లేద‌ని తెలుగుదేశం పార్టీ రుజువు చేసిన‌ట్టుగా అయ్యింది. అమ‌రావ‌తి నినాదంతో… రాయ‌ల‌సీమ‌లోనో, విశాఖ‌లోనే అడుగుపెట్టే ధైర్యం కూడా చంద్ర‌బాబుకు లేద‌ని స్ప‌ష్టం అవుతోంది.