వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ విచారణ కోరుతూ కోర్టుకు ఎక్కిన తెలుగుదేశం నేతలకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తరఫు నుంచి కౌంటర్లు దాఖలు అయ్యాయి. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని తెలుగుదేశం పార్టీ వాళ్లు, మాజీ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
అయితే వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. అప్పుడు ఆ కేసును సీబీఐకి అప్పగించడానికి తెలుగుదేశం వాళ్లు ఒప్పుకోలేదు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అందుకు ససేమేరా అన్నారు. అలాగే ఇప్పుడు సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన నేతలు కూడా అప్పుడు సీబీఐ విచారణకు వ్యతిరేకంగా మాట్లాడారు. వారిలో ఆదినారాయణ రెడ్డి ముఖ్యులు.
వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని, రాష్ట్ర పోలీసులు సవ్యంగా ధర్యాప్తు చేస్తారని అప్పట్లో టీడీపీ నేతగా ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ఆయనే సీబీఐ విచారణ కావాలంటూ కోర్టుకు ఎక్కారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై జరిగిన వాదనల్లో ప్రభుత్వం తరఫు న్యాయవాది గతంలో ఇదే పిటిషనర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
వివేకానందరెడ్డి హత్య కేసుపై సిట్ ధర్యాప్తు కీలక దశలో ఉందని కోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది విన్నవించారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ ను దాఖలు చేయబోతున్నట్టుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణను కోర్టు ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది.