నిపుణుల అంచనా ప్రకారం ఈ పాటికి ఉల్లి ధరలు తగ్గాలి. సామాన్యులకు అందుబాటులోకి రావాలి. కానీ అలా జరగలేదు. కనీసం మరో 2 వారాల పాటు ఉల్లి ధరలు తగ్గవని అంటున్నాయి మార్కెట్ వర్గాలు. మారిన వాతావరణ పరిస్థితుల వల్ల సకాలంలో ఉల్లి పంట మార్కెట్ కు రావడం లేదని, దీంతో ధరలు దిగిరావడం లేదంటున్నారు. జనవరి మొదటి వారంలో తగ్గుతాయనుకున్న ఉల్లి ధరల కోసం జనవరి మూడో వారం వరకు వేచి చూడాల్సిందే.
అయితే పంట చేతికి రాకపోయినా మార్కెట్లో ఉల్లి ధర పెరిగే అవకాశం లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఈ మేరకు ధర నియంత్రణలో ఉంది. ఒకప్పుడు 150 రూపాయల నుంచి 200 రూపాయలు పలికిన ఉల్లి.. ఇప్పుడు 60-70 రూపాయలకే కిలో చొప్పున దొరుకుతుంది. అయితే ఈ ఉల్లిలో క్వాలిటీ కనిపించడం లేదు. కాస్త సైజులో పెద్దగా ఉండే ఉల్లి కావాలంటే మళ్లీ 150 రూపాయలు పెట్టాల్సిందే.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో నిత్యావసరాలకు సరిపడ ఉల్లిని అందుబాటులో ఉంచాయి ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ లో అయితే రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని 15 రూపాయలకే అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇవేవీ ప్రజల అవసరాలకు తగ్గ స్థాయిలో ఉండడం లేదు.
కాబట్టి… మంచి ఉల్లి తక్కువ ధరకు కావాలంటే ఈ నెలాఖరు వరకు ఎదురుచూడాల్సిందే. అప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఉల్లి అందుబాటులోకి వస్తుంది. ఎలా చూసుకున్నా ప్రజలకు ఈ సంక్రాంతికి ఉల్లి కష్టాలు తప్పేలా లేవు.