దక్షిణాదిన సినీ హీరోలను రాజకీయంగా తిరస్కరిస్తున్నారు ప్రజలు. మామూలుగా తిరస్కరించడం కాదు, చిత్తు చిత్తుగా ఓడిస్తున్నారు. తెలుగునాట రాజకీయంగా తెగ హల్చల్ చేసిన పవన్ కల్యాణ్.. చివరకు రెండు చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయాడు. రెండు చోట్లా ఓడిపోయాడు. తమిళనాట కమల్ హాసన్ పరిస్థితి దాదాపు అదే. కమల్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఆయన పార్టీ పోటీ చేసి చిత్తు అయ్యింది. ఇక తమిళనాట స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అటు కమల్, ఇటు రజనీలు రెడీగా లేరని స్పష్టం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వీరు సత్తా చాటతారట!
ఇక తెలుగునాట ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన పవన్ కల్యాణ్.. తను సీఎం జగన్ ను గుర్తించను అంటూ మేకపోతు గాంభీర్యాలు చూపిస్తూ ఉన్నాడు. ఇలా సాగుతోంది సినిమా వాళ్ల రాజకీయం. అయినప్పటికీ సదరు హీరోల అభిమానులు మాత్రం వాస్తవంలోకి రావడం లేదు. జనాలు తమ హీరోలను రాజకీయంగా తిరస్కరించేసినప్పటికీ.. వారిని కనీసం ఎమ్మెల్యేలుగా ఎన్నుకోనప్పటికీ అభిమానులు మాత్రం వాస్తవంలోకి రావడం లేదు, వాస్తవాలను జీర్ణించుకోవడం లేదు.
ఇదే కోవలోనే కనిపిస్తూ ఉన్నారు తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానులు. విజయ్ రాజకీయాల పట్ల కూడా ఆయన అభిమానులు చాలా ఉత్సాహంతో ఉన్నారు. అజిత్ అభిమానులు, విజయ్ అభిమానులు తమ అభిమాన హీరోలు తమిళనాడుకు సీఎం లు అవుతారనే రేంజ్ లో ఊహించుకుంటూ ఉంటారు. జయలలిత చివరి దశలో ఉన్నప్పుడు అజిత్ ను ఆమె తమిళనాడు సీఎంగా ప్రకటించబోతోందంటూ ఆ హీరో ఫ్యాన్స్ కామెడీ చేశారు. ఇక ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ అయితే… తమ హీరో 'సీఎం' అయిపోయాడని అంటున్నారట.
ఏ ఎన్నికల్లో పోటీ చేసి విజయ్ తమిళనాడుకు సీఎం అయ్యాడబ్బా.. అని ఆలోచనలో పడనక్కర్లేదు. 'సీఎం' అంటే కలెక్షన్ మాస్టర్ అట! విజయ్ కొత్త సినిమాకు 'మాస్టర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీంతో కలెక్షన్ మాస్టర్.. షార్ట్ ఫామ్ లో సీఎం అంటూ విజయ్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారట. ఈ సినీ హీరోల వెర్రిమొర్రి అభిమానులు అలా తమ త్రిశంకు స్వర్గాల్లోనే ఊగిపోతున్నట్టుగా ఉన్నారు.