తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌తోపాటుగా విశాఖపట్నంలో కూడా అభివృద్ధి చెందాల్సి వుంది. చాలాకాలం క్రిందటే విశాఖపట్నంను కొందరు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు 'సెకెండ్ డెస్టినేషన్'గా భావించారుగానీ, ఆ దిశగా అడుగులు సరిగ్గా ముందుకు కదలలేదన్నది నిర్వివాదాంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక, విశాఖలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే డిమాండ్ తెరపైకొచ్చింది. 'ఇదిగో భూముల కేటాయింపు.. అదిగో మౌళిక వసతుల కల్పన..' అంటూ చంద్రబాబు సర్కార్ గత ఐదేళ్ళలో నానా యాగీ చేసింది తప్ప, సినీ పరిశ్రమను ఆ దిశగా ముందుకు నడిపించలేకపోయింది.
అది గతం.. ప్రస్తుతంలోకి వస్తే, రాష్ట్రంలోని వైఎస్ జగన్ సర్కార్, విశాఖలో సినీ పరిశ్రమకు భూముల్ని కేటాయించేందుకు సిద్ధంగా వుంది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసినప్పుడు సినీ పరిశ్రమ గురించిన చర్చ జరిగిందనీ, పరిశ్రమ అభివృద్ధి కోసం ఏం చేయడానికైనా తమ ప్రభుత్వం సిద్ధమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చిరంజీవి చెప్పుకొచ్చారు.
మరోపక్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అవంతి శ్రీనివాస్‌కో మరొకరికో బాధ్యతలు అప్పగించే అవకాశముందంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ సంగతి పక్కన పెడితే, విశాఖ అభివృద్ధికి నడుం బిగించిన జగన్ సర్కార్, సినీ పరిశ్రమకు విశాఖలో అవకాశాలు కల్పిస్తే, నగరం అభివృద్ధిలో అదొక కీలకమైన ముందడుగు అవుతుందనే భావనతో వున్నట్లు తెలుస్తోంది.
అతి త్వరలోనే సినీ ప్రముఖులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా వైఎస్ జగన్ సర్కార్ కసరత్తులు చేస్తోందట. అయితే, దానికన్నా ముందుగా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో సమావేశమయి, తమ సమస్యల గురించి విన్నవించుకోవాల్సి వుంటుంది. అయితే, సినీ పరిశ్రమలో జగన్ పట్ల వ్యతిరేక భావంతో వున్నవారే ఎక్కువ. ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్‌ని అభినందించేందుకూ ఒకరిద్దరు మినహా ఎవరూ ఆసక్తి చూపని విషయం విదితమే.