రాజధాని కమిటీల దారులన్నీ విశాఖ వైపే పరుగులు తీస్తున్నాయి. పదిరోజుల క్రితం జీఎన్ రావు, నిన్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఇచ్చిన కమిటీ కూడా విశాఖనే పరిపాలన రాజధానిగా ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి సూచనలిచ్చింది.
అలాగే అనేక అంశాలపై సమగ్రమైన అధ్యయనం చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ పలు ఆప్షన్లను ప్రభుత్వం ముందు ఉంచింది.
జీఎన్ రావు కమిటీ ఏం చెప్పిందంటే…
రాజధానిపై పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా జగన్ సర్కార్ గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు కన్వీనర్‌గా ఐదుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి అనేక అంశాలను పరిగణలోకి గత నెల 20న సీఎం జగన్‌కు 125 పేజీల నివేదిక సమర్పించింది.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసనసభా రాజధాని (లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలనా రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూల్‌లో న్యాయరాజధాని (జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో సూచించింది.
‘బోస్టన్’ కమిటీ ఆప్షన్స్ ఏంటంటే…
అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలనేది ప్రభుత్వ ప్రాతిపదిక అని ఏలూరు సభలో సీఎం జగన్ అన్న మాటలు గుర్తు తెచ్చుకోండి. సరిగ్గా ఇలాంటి అభిప్రాయంతోనే బోస్టన్ కమిటీ కూడా పలు అంశాలను సూచస్తూ రాష్ర్ట ప్రభుత్వానికి ఆప్షన్స్ ఇచ్చింది. జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన రెండు వారాలకు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సీఎంకు నివేదిక సమర్పించింది.
ఈ నివేదిక విశాఖలో సచివాలయం, రాజ్‌భవన్, సీఎం కార్యాలయం, అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలు, అత్యవసర అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, విజయవాడలో 15 ప్రభుత్వ శాఖలు, రాయలసీమలోని కర్నూలులో ప్రధాన హైకోర్టు, అన్ని రకాల ట్రైబ్యునళ్లు, కమిషన్లు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధించవచ్చని విస్పష్టంగా పేర్కొంది.
అభివృద్ధి వికేంద్రీకరణకు రెండు కమిటీలది ఒకటే మాట
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలో సమాన అభివృద్ధి జరగాలని జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు రెండూ కూడా దాదాపు ఒకే రకమైన సిఫార్సులు చేశాయి. అంతేకాదు వాతావరణ పరిస్థితుల రీత్యా రాజధానిగా అమరావతి సరైన ప్రాంతం కాదని కూడా స్పష్టం చేశాయి. విశాఖలో పరిపాలన రాజధాని, రాజ్‌భవన్, సచివాలయం తదితర కార్యాలయాలు ఏర్పాటు చేయాలని రెండు కమిటీలు ఒకేలా సూచించాయి. ఇలా అనేక అంశాల్లో రెండు కమిటీల సిఫార్సులు, సూచనలు భావ సారూప్యతను కనబరిచాయి.
జీఎన్ రావు కమిటీతో పోల్చుకుంటే బోస్టన్ కమిటీ మరింత లోతుగా, సమగ్రమైన నివేదిక సమర్పించిందని చెప్పొచ్చు. రాష్ట్రంలో సమాన అభివృద్ధి సాధిస్తూ, అన్ని రంగాల్లో రాష్ట్ర పురోభివృద్ధికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించి జగన్ సర్కార్ ముందు రెండు ఆప్షన్లు ఉంచింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రాంతీయ ప్రాతినిథ్యం, సమన్వయం, వ్యయం, ప్రజల సౌలభ్యం కోణాల్లో రెండు ఆప్షన్ల అనుకూల, ప్రతికూల అంశాలను బీసీజీ విశ్లేషించింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది జగన్ సర్కారే.