కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గెందుకు….?

పుట్టిన కులం పేరు చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గు పవన్ అంటున్నారు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ. తనకు కులం లేదని ఒకసారి అంటూ మరోసారి కులాల గురించి మాట్లాడుతూ జనసేనాని పవన్ చేస్తున్న రాజకీయం…

పుట్టిన కులం పేరు చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గు పవన్ అంటున్నారు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ. తనకు కులం లేదని ఒకసారి అంటూ మరోసారి కులాల గురించి మాట్లాడుతూ జనసేనాని పవన్ చేస్తున్న రాజకీయం ఏంటో అర్థం కావడం లేదు అని బొత్స అంటున్నారు.

నేను తూర్పు కాపుని, మా కులాన్ని బీసీ క్యాటగిరీలో చేర్చారు. నా కులాన్ని నేను కచ్చితంగా చెప్పుకుంటాను అని బొత్స అన్నారు. అదే సమయంలో పవన్ మాత్రం కులం లేదని చెబుతూ దాని గురించే ఎక్కువగా మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. అసలు పవన్ వల్ల కాపులకు ఒరిగిదేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సెలిబ్రిటీ పార్టీ అని ఆయన సెటైర్లు వేశారు. ఆ పార్టీ ఉనికి కోసం ఆయన అపుడపుడు వచ్చి తమపైన విమర్శలు చేసి పోతూంటారని అన్నారు. ఏపీలో బీసీల సంక్షేమ చూసే పార్టీ వైసీపీ మాత్రమే అని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎవరు బయటకు చెప్పకపోయినా వాస్తవం అదే అన్నారు.

నాలుగేళ్ల కాలంలో రెండు లక్షల కోట్లకు పైగా పత్యక్ష నగదు బదిలీని వివిధ పధకాల దాకా ఇస్తే అందులో యాభై శాతం బీసీలకే ఖర్చు చేసిన ప్రభుత్వం తమదని అన్నారు. బీసీలు తమకు బ్యాక్ బోన్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బీసీలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు.

ఎన్నికల ప్రణాళికలో చెప్పిన మేరకు 99 శాతం హామీలను తమ ప్రభుత్వం చేసిందని, అందుకే 175 సీట్లు గెలుస్తామని గట్టిగా చెబుతున్నామని బొత్స అన్నారు. వైసీపీ ఓడిపోవాలని పవన్ అంటున్నారని, అసలు వైసీపీ ఎందుకు ఓడిపోవాలని ఆయన ఎదురు ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా విధానంలో మార్పులు తెస్తున్నందుకా, లేక వైద్య రంగంలో ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి విప్లవాత్మకమైన చర్యలను చేపడుతున్నందుకా  చెప్పాలని ఆయన కోరారు.

బీసీలకు ఏమీ చేయకపోబట్టే చంద్రబాబును బీసీలు నమ్మడం లేదని, అందుకే పవన్ కళ్యాణ్ బీసీల గురించి మాట్లాడుతున్నారని బొత్స విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలను చూస్తే ఒక్కోసారి జాలి వేస్తుందని కూడా ఆయన అనడం విశేషం. పవన్ జనసేన ఆవిర్భావ సభ కంటే ముందే వైసీపీ సీనియర్ మంత్రి నుంచి ఒక స్థాయిలో రియాక్షన్ వచ్చింది. రేపటి రోజున ఇంకా ఎక్కువ రావచ్చు అనే అంటున్నారు.