కూతురు నిర్మాత.. తండ్రి హీరో.. మెగా మూవీ లోడింగ్

మెగా కాంపౌండ్ నుంచి వచ్చే ప్రతి హీరోకి చిరంజీవి ఆశీస్సులుంటాయి. దాదాపు ప్రతి మెగా హీరోను చిరంజీవి ప్రోత్సహించారు, ప్రమోషన్ ఇచ్చారు. కానీ కన్నకూతురు విషయంలో ఇది జరగలేదు. సుశ్మిత కొణెదల బ్యానర్ పెట్టారు,…

మెగా కాంపౌండ్ నుంచి వచ్చే ప్రతి హీరోకి చిరంజీవి ఆశీస్సులుంటాయి. దాదాపు ప్రతి మెగా హీరోను చిరంజీవి ప్రోత్సహించారు, ప్రమోషన్ ఇచ్చారు. కానీ కన్నకూతురు విషయంలో ఇది జరగలేదు. సుశ్మిత కొణెదల బ్యానర్ పెట్టారు, కానీ ఇప్పటివరకు దానికి 'మెగా ప్రోత్సాహం' దక్కలేదు.

తన బ్యానర్ పై ముందుగా వెబ్ సిరీస్ తీశారు సుశ్మిత. ఆ తర్వాత సంతోష్ శోభన్ తో ఓ చిన్న సినిమా తీశారు. దాన్ని రిలీజ్ చేయడానికి, అమ్ముకోవడానికి ఆమె ఎంత ఇబ్బంది పడ్డారో మార్కెట్లో ఉన్న జనాలకు తెలుసు. ఈ రెండు వెంచర్ల విషయంలో 'చిరు ప్రమేయం' చాలా తక్కువ.

ఎట్టకేలకు కూతురు కెరీర్ పై దృష్టిపెట్టారు చిరంజీవి. సుశ్మిత నిర్మాతగా, చిరంజీవి హీరోగా సినిమా దాదాపు లాక్ అయ్యే స్టేజ్ లో ఉంది. ఈ మూవీతో తను స్థాపించిన గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్, పెద్ద కంపెనీగా మారుతుందని సుశ్మిత భావిస్తోంది.

నిజానికి చిరంజీవికి ఆల్రెడీ ఓ బ్యానర్ ఉంది. తను ఏ సినిమా చేసినా కొణెదల ప్రొడక్షన్స్ కంపెనీ దానికి అనుబంధంగా ఉంటుంది. ఆ కారణంతోనే ఇన్నాళ్లూ గోల్డ్ బాక్స్ కు ఆయన అవకాశం ఇవ్వలేకపోయారు. ఇప్పుడిక ఇవ్వక తప్పని పరిస్థితి.

కూతురు-అల్లుడ్ని నిర్మాతలుగా నిలబెట్టాలని చిరంజీవి భావిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే వాళ్ల కోసం ఓ సినిమా చేయబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఓ తమిళ దర్శకుడితో సుశ్మిత నిర్మాతగా చిరు హీరోగా సినిమా లాక్ అయ్యే అవకాశం ఉంది.