యాషెస్ సీరిస్ లో చిత్తు చిత్తుగా ఓడుతున్న ఇంగ్లండ్ మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒక కేలండర్ ఇయర్ లో అత్యధిక టెస్టుల్లో ఓడిన జట్టు జాబితాలో ఇంగ్లండ్ ముందు వరసలో నిలుస్తోంది. ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ పేరిట ఉన్న ఈ ఓటముల రికార్డుతో ఇంగ్లాండ్ సమస్థాయికి చేరడం గమనార్హం!
ఈ ఏడాదిలో ఇంగ్లిష్ జట్టు ఓడిన టెస్టుల సంఖ్య తొమ్మిది! బంగ్లాదేశ్ కూడా తన ప్రస్థానంలో ఒకే ఏడాది తొమ్మిది ఓటములతో చెత్త రికార్డును కలిగి ఉంది. ఇప్పుడు ఇంగ్లాండ్ బంగ్లా సరసన నిలిచింది. యాషెస్ సీరిస్ లో ఇప్పటికే ఇంగ్లండ్ మూడు టెస్టులను ఓడింది. అది కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతోంది.
దీనికన్నా ముందు స్వదేశంలో ఇండియా చేతిలో కూడా ఇంగ్లండ్ ఆల్మోస్ట్ సీరిస్ ను ఓడిపోయింది. ఒక టెస్టు మ్యాచ్ ను ఇంగ్లిష్ జట్టు నెగ్గినా, ఆఖరి మ్యాచ్ ఆగిపోయిన ఆ సీరిస్ లో టీమిండియాదే పై చేయి. అంతకన్నా ముందు ఇండియాలో పర్యటించి ఇంగ్లండ్ జట్టు సీరిస్ ఓడిపోయింది. ఆ సీరిస్ లో ఒక టెస్టు గెలిచినా.. ఆ తర్వాత మాత్రం వరసగా ఓడిపోయింది. ఇలా బ్రిటీష్ జట్టు టెస్టుల్లో పూర్తి స్థాయి ఫెయిల్యూర్ గా నిలుస్తోంది.
స్వదేశంలో కూడా పరువు నిలుపుకోలేకపోయింది. అయితే ఇంగ్లండ్ క్రికెట్ చాలా సంవత్సరాలుగా పరిమిత ఓవర్ల మీద దృష్టి సారించింది. టీ20 ప్రపంచకప్ లో కూడా ఈ జట్టు బాగానే ఆడింది. కొన్నేళ్లుగా ఇంగ్లాండ్ జట్టు వన్డే, టీ20ల విషయంలో బలమైన జట్టుగా ఉంది. అరువు ఆటగాళ్లతోనో, వలస ఆటగాళ్లతోనే బలోపేతంగా మారింది. కానీ, టెస్టుల్లో మాత్రం స్వదేశంలో కూడా గట్టి జట్టుగా నిలవలేకపోతోంది. ఇండియా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లకు పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. మరి వేరే జట్లు ఓడిపోతే తెగ స్పందించే మైకేల్ వాన్ లాంటి వాళ్లు సొంత జట్టు దీన స్థితిపై స్పందించలేదింకా!