ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టులో ఝలక్ లు తగలడం సర్వసాధారణంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలు ఏవైనా ఏపీలో వాటిపై కోర్టుకు ఎవరో ఒకరు వెళ్లపడం పరిపాటిగా మారింది. ఈ పిటిషన్లు చాలా హద్దు మీరాయని కొన్ని సందర్భాల్లో హైకోర్టే వ్యాఖ్యానించింది. అయితే జగన్ ప్రభుత్వం తెచ్చిన కొన్ని చట్టాల విషయంలో, తీసుకున్న నిర్ణయాల విషయంలో కోర్టు జీవోల కొట్టి వేత కొనసాగుతూ ఉంది.
ఈ విషయంలో గమనిస్తే.. కొన్ని సార్లు సింగిల్ జడ్జి తీర్పు వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వానికి గట్టి ఝలక్ తగులుతూ ఉండటం, ధర్మాసనం వద్ద ఊరట లభిస్తూ ఉండటం కూడా గమనించాల్సిన అంశం. ఇందులో చట్టపరంగా, న్యాయపరంగా జరిగే మార్పులు ఏమిటో కానీ.. తీర్పులు మారిన దాఖలాలు ఉన్నాయి.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యవహారంలో ఇదే జరిగింది. కొత్త ఎస్ఈసీ వచ్చిన తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కొంతమంది కోర్టుకు వెళ్లారు. పోలింగ్ కు సమయం దగ్గరపడిన తరుణంలో సింగిల్ జడ్జి తీర్పులో ఆ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేశారు! అయితే అప్పుడు ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. రేపు పోలింగ్ అనంగా.. ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలింగ్ జరిగింది!
ఇక పోలింగ్ తర్వాత మరో పిటిషన్ దాఖలైంది. అప్పుడు కూడా సింగిల్ జడ్జి ప్రభుత్వానికి, ఎస్ఈసీకి ఝలక్ ఇచ్చారు. పోలింగ్ పూర్తైన ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే ప్రభుత్వం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్వహించిన ఆ ఎన్నికల కథ అంతేనా.. అనుకుంటున్న తరుణంలో ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టి వేసింది. పోల్ అయిన ఓట్ల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక విద్యా దీవెన పథకం విషయంలో కూడా ఇదే జరగడం గమనార్హం. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం విద్యా సంస్థల ఖాతాలో కాకుండా.. లబ్ధి పొందుతున్న పిల్లల తల్లిదండ్రుల ఖాతాలోకి డబ్బులు జమచేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం డబ్బును కాలేజీల ఖాతాల్లోకి వేయాలి తప్ప.. పిల్లల తల్లిదండ్రుల ఖాతాలోకి కాదని వారు వాదించారు.
ఆ మేరకు కోర్టు ఏకీభవించింది. విద్యాదీవెన డబ్బులను ప్రేవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల ఖాతాలోకే వేయాలని ఇది వరకే సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు వచ్చింది. అయితే ఆ అంశంపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ ను వేసింది. కానీ కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈ అంశంపై ధర్మసనాన్ని ఆశ్రయించగా.. జగన్ ప్రభుత్వానికి ఊరట లభించింది.
ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది విద్యా సంస్థల కోసం కాదని, పిల్లల చదువుల కోసమని, ఈ పథకం డబ్బులను ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలనేది ప్రభుత్వ ఇష్టం అవుతుంది తప్ప.. ప్రైవేట్ సంస్థలు చెప్పినట్టు కాదనే వాదనతో ప్రభుత్వం ధర్మాసనం వద్ద కాస్త ఊరట పొందింది. ప్రస్తుతానికి అయితే సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మాసనం స్టే ఇచ్చింది. మరి ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో కానీ, సింగిల్ జడ్జి వద్ద తీర్పుపై ధర్మాసనం స్టే విధించింది. జడ్పీటీసీ ఎన్నికల పిటిషన్లను తలపింపజేస్తోంది ఈ వ్యవహారం.