ఆనందయ్యను టార్గెట్ చేసింది ఎవరు..?

ఆనందయ్య మందు విషయంలో ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి విమర్శలు వారివి. కానీ ఆనందయ్య మందు పంపిణీ చేయొద్దంటూ గ్రామస్తులు ఎదురు తిరిగారంటే పరిస్థితి ఊహించొచ్చు. ఆనందయ్య కరోనా నివారణ మందు తయారీదారు కాదు.…

ఆనందయ్య మందు విషయంలో ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి విమర్శలు వారివి. కానీ ఆనందయ్య మందు పంపిణీ చేయొద్దంటూ గ్రామస్తులు ఎదురు తిరిగారంటే పరిస్థితి ఊహించొచ్చు. ఆనందయ్య కరోనా నివారణ మందు తయారీదారు కాదు. అంతకు ముందు చాలా సంవత్సరాల నుంచీ ఆయన ఆయుర్వేద వైద్యుడు. రోజుకి కనీసం పాతికమంది ఆయన ఆయుర్వేద మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆదివారం ఇంటి పరిసరాలు కిటకిటలాడతాయి.

ఇలాంటి టైమ్ లో కరోనా మందుతో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. దీంతో సహజంగానే కొంతమందికి ఇది గిట్టలేదు. ఆనందయ్యను అప్పుడు టార్గెట్ చేశారు, ఇప్పుడూ టార్గెట్ చేస్తున్నారు. దీనికి లోకల్ మీడియా సపోర్ట్ కూడా తీసుకుంటున్నారట. ఇద్దరు ముగ్గురు శాటిలైట్ ఛానెళ్ల రిపోర్టర్లను అడ్డు పెట్టుకుని ఆనందయ్య ఇంటి ముందు సోమవారం పెద్ద ఇష్యూ చేశారు. దాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.

ఆనందయ్య మందుతో స్థానికులకు ఇబ్బందేంటి..?

ఆనందయ్య మందు పంపిణీని అడ్డుకోవాలంటూ గతంలో చాలామంది ప్రయత్నించారు. వీరికి మెడికల్ మాఫియా సపోర్ట్ ఉందనే ప్రచారం కూడా జరిగింది. అయితే అందులో వాస్తవం ఎంతుందనేది ఎవరికీ తెలియదు. అయితే ఆనందయ్య మందు మార్కెట్లోకి వచ్చిన తర్వాతే చాలామందిలో ధైర్యం పెరిగింది. కరోనాకి ధైర్యమే మందు, అది ఆనందయ్య మందుతో కలిగింది. అంతవరకు సంతోషమే.

అయితే సీరియస్ కేసులకు ఆనందయ్య మందు పనిచేయలేదని, కొంతమంది చనిపోయారని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీతో కృష్ణపట్నం ఊరిలో గందరగోళ వాతావరణం నెలకొంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయేది. ఆ ఊరివాళ్లు ఇంటికి వెళ్లేందుకు కూడా దారి దొరికేది కాదు. ఊరంతా కరోనా రోగులతో నిండిపోయే సరికి సహజంగానే అందరిలో భయం పెరిగింది. ఇప్పుడు మళ్లీ ఒమిక్రాన్ అనే సరికి రోగులంతా తమ ఊరిపై పడిపోతారేమోనని జనం భయపడుతున్నారు.

జనం భయం గోరంత, దాన్ని కొండంత చేశారు కొంతమంది. మీడియా సమక్షంలోనే ఆ ఊరిలో ఆనందయ్య ఇంటిని ముట్టడించే కార్యక్రమం చేపట్టారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఆనందయ్యను పరోక్షంగా టార్గెట్ చేస్తున్నాయని అంటున్నారు. సోమవారం జరిగిన సంఘటన క్షణాల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది, ఆనందయ్యను అడ్డుకున్నారని, ఆయన మందు పంపిణీ ఆపేశారని, ఆయన ఇక మందు పంపిణీ చేయలేరంటూ ప్రచారం జరిగింది.

అయితే ఈ ప్రచారం కావాలనే జరిగిందని, ఒకరిద్దరు పనిగట్టుకుని దీన్ని హైలెట్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి ఆనందయ్య ఒమిక్రాన్ వేరియంట్ తో మరోసారి సంచలనం సృష్టిస్తే.. అంతలోనే ఆయన సొంత ఊరిలో హడావిడి జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందని అంటున్నారు. ఇంతకీ ఆనందయ్య శత్రువులెవరు. ఉచితంగా ఇచ్చే ఆయుర్వేదం మందు పంపిణీని ఆపేస్తే వారికి కలిగే లాభమేంటి..? ఇదే ఇప్పుడు తేలాల్సి ఉంది.