నవ్యాంధ్ర ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా రాజధాని విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. దీనికి కారణం ఎవరు, ఏంటి అనే విషయాన్ని పక్కనపెడితే.. రాజధాని పేరు చెప్పుకోలేక సగటు ఆంధ్రుడు ఇబ్బందిపడుతున్నమాట వాస్తవం. కోర్టు కేసులతో రాజకీయ స్వలాభం కోసం ప్రతిపక్షాలు ఆడిన ఆట ఇంకా ముగిసిపోలేదు. దీని ఫలితమే ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు వెనక్కి పోవడం, కొత్త బిల్లు పెండింగ్ లో పడిపోవడం.
మూడు రాజధానుల బిల్లుపై వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశముందని ఊహించిన ప్రభుత్వం బిల్లు ఉపసంహరించుకుంటున్నట్టు అసెంబ్లీలో ప్రకటించింది. అదే సమయంలో కొత్త బిల్లు ప్రవేశపెడతామని కూడా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు సీఎం జగన్. బిల్లుల్ని ఉపసంహరించుకుంటే కోర్టులో కేసుల్ని కొట్టేస్తారని ఏపీ ప్రభుత్వం భావించింది. బిల్లులే లేనప్పుడు కేసులుండవని అనుకుంది.
కానీ హైకోర్టులో 3 రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 70 పిటిషన్లు దాఖలు కాగా.. వీటిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. బిల్లులు వెనక్కి తీసుకున్నాం కాబట్టి కేసులు కొట్టేయాలని ప్రభుత్వం కోరుతున్నప్పటికీ.. రాజధాని మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం అమలు చేసేలా హైకోర్టు ఆదేశాలివ్వాలని అమరావతి రైతులు పట్టుబడుతున్నారు. అంటే రాజధాని ఒకటా, మూడా అనే విషయం తేలే వరకు ఈ ప్రతిష్టంభన కొనసాగుతుందనమాట.
కేసులతో పీటముడి..
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుని కొత్త తరహాలో పగడ్బందీగా రూపొందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కోర్టు కేసులతో ఎవరూ ప్రశ్నించలేని విధంగా ఈ దఫా బిల్లు రూపొందించాలని భావిస్తోంది. అదే సమయంలో అమరావతి రైతులకు కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నా.. ప్రతిపక్షాల మాయలోపడి వారు అసెంబ్లీతో పాటు సెక్రటేరియట్, హైకోర్ట్ అన్నీ మాకే కావాలంటున్నారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. సీఆర్డీఏ రద్దు బిల్లు వెనక్కి తీసుకోవడంతోపాటు, మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. కోర్టు కేసులు కొనసాగుతుండటంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. అభివృద్ధి వికేంద్రీకరణ కొత్త బిల్లుపై పీటముడి పడింది.
కోర్టులో కేసులు కొట్టేస్తే తప్ప, మరో బిల్లు తీసుకురాలేరు. ఆ కేసులు ఎప్పుడు కొట్టేస్తారో తెలీదు. ఇదీ ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితి. ఒకరకంగా ఇది జగన్ కు రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే.. అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకునేవారంతా జగన్ కు, అమరావతి ప్రజలంతా వైరి పక్షాలకు మద్దతుగా నిలుస్తారు. మరి కొత్త బిల్లులపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.