హెడ్డింగ్ రివర్స్ లో ఉంది కదా? సాధారణంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటారు. కానీ ఇక్కడ మాత్రం పెళ్లయి, పిల్లల్ని కన్న తర్వాత ప్రేమించుకున్నారు. భార్యాభర్తలు ఇలా చేస్తే ఓకే. కానీ ఓ కుటుంబానికి చెందిన భర్త, మరో కుటుంబానికి చెందిన భార్య ఇలా చేశారు. అదే ఇప్పుడు అనంతపురంలో హాట్ టాపిక్ గా మారింది.
అనంతపురం జిల్లా ఉప్పారపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఆల్రెడీ పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. దగ్గర్లో ఉన్న చిన్నకుంట గ్రామానికి చెందిన ఓ మహిళకు కూడా పెళ్లయింది. భర్తతో కాపురం చేస్తూ పిల్లల్ని కూడా కనింది. ఉప్పారపల్లికి చెందిన వ్యక్తికి, చిన్నకుంటకు చెందిన మహిళకు పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది.
భర్త దగ్గర పొందలేని ప్రేమను ఈ వ్యక్తిలో చూసింది సదరు మహిళ. అటు ఆ వ్యక్తి కూడా తన భార్య దగ్గర పొందలేని ప్రేమను ఈమెలో చూశాడు. ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు. వీళ్లు దీన్ని ప్రేమ అనుకున్నారు. కానీ పెద్దలు మాత్రం దీనికి అక్రమ సంబంధం అనే పేరు పెట్టారు. అనైతిక బంధం అనే ట్యాగ్ లైన్ తగిలించారు.
పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించడం అసాధ్యమని ఇద్దరికీ అర్థమైపోయింది. ప్రేమ మైకంలో కళ్లుమూసుకుపోయిన ఆ జంట చావే సమస్యకు పరిష్కారం అనుకుంది. చనిపోయి, మరో జన్మ ఎత్తి పెళ్లి చేసుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పురుగుల మందు తాగేశారు.
కానీ చనిపోవాలనుకున్న ఈ ఇద్దరు వ్యక్తుల్లో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మహిళ మాత్రం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన 2 కుటుంబాల మధ్య తీరని వేదన మిగిల్చింది.