ఏపీలో ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణను చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఏపీ హై కోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం ఫీజులను నియంత్రించడానికి వీల్లేదంటూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారించి, ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టి వేసింది. ఈ మేరకు జగన్ ప్రభుత్వానికి మరో గట్టి షాక్ తగిలింది.
ఏపీలోనే గాక.. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూళ్ల, జూనియర్ కాలేజీల ఫీజుల దందా గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. పిల్లలను స్కూళ్లకు పంపాలంటే ఆస్తులు తాకట్టు పెట్టుకోవాల్సిన రేంజ్ కు చేరాయి ఫీజులు. ఇలాంటి క్రమంలో ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారాలపై తల్లిదండ్రుల్లో కూడా తీవ్ర అసహనాలు రేగాయి. తప్పక పిల్లలను ఆ స్కూళ్లలోనూ, కార్పొరేట్ కాలేజీల్లోనే చేర్పించడం తప్ప.. మరో గత్యంతరం లేకపోయింది. ఈ పరిస్థితిని అలుసుగా తీసుకుని ప్రేవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు దోపిడీని నిరాకంటంగా సాగించాయి.
ర్యాంకుల పేరుతో.. మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చాయి. అదుపులేని ఈ విద్యావ్యాపారంపై సామాన్యుల్లో అసహనం రేగుతున్న దశలో.. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా.. జీవో నంబర్ 53, 54 లను జారీ చేసింది. పట్టణాల స్థాయి, సౌకర్యాలు, సదుపాయాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించింది.
ఈ మేరకు తల్లిదండ్రుల్లో సానుకూలత వ్యక్తం అయ్యింది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పక్క రాష్ట్రాల తల్లిదండ్రులు కూడా స్వాగతించారు. విద్యా వ్యాపారంలో దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం పూనుకుందని అనేక మంది అనుకున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఆయా స్కూళ్లు, కాలేజీల ముందు ప్రభుత్వ జీవో ఫ్లెక్సీలను కట్టారు. ప్రభుత్వ ఆదేశాల స్థాయిలో మాత్రమే ఫీజులు కట్టాలని తల్లిదండ్రులకు కూడా స్పష్టత ఇచ్చారు.
సహజంగానే ఇది ప్రైవేట్ విద్యాసంస్థలకు నచ్చలేదు. ఈ నేపథ్యంలో అవి ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. విచారించిన న్యాయస్థానం.. ప్రభుత్వ జీవోలను రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. ప్రైవేట్ కాలేజీల, స్కూళ్ల ఫీజుల నియంత్రణ చట్టం ఇలా కొట్టివేతకు గురయ్యింది.