మొన్నటివరకు దేవుడు.. ఇప్పుడు విలన్ అయ్యారు

కరోనా సెకెండ్ వేవ్ లో ఆనందయ్య దేవుడయ్యాడు. చాలామంది ఆయన్ను అలానే చూశారు. చుక్కల మందు కోసమైతే క్యూ కట్టారు. ఆయనకు ఎన్నో సన్మానాలు జరిగాయి. ఆయన పేరిట కరోనా మందు పంపిణీ తెలుగు…

కరోనా సెకెండ్ వేవ్ లో ఆనందయ్య దేవుడయ్యాడు. చాలామంది ఆయన్ను అలానే చూశారు. చుక్కల మందు కోసమైతే క్యూ కట్టారు. ఆయనకు ఎన్నో సన్మానాలు జరిగాయి. ఆయన పేరిట కరోనా మందు పంపిణీ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగింది. ఆయన ఎంత పాపులర్ అయ్యారంటే.. రేపోమాపో ఆయన సొంతంగా పార్టీ స్థాపించి ఎన్నికల్లో దిగుతారని కూడా అంతా అనుకున్నారు. అలాంటి దేవుడు ఆనందయ్య ఇప్పుడు విలన్ అయ్యారు. అది కూడా సొంత ఊరి మనుషుల దృష్టిలో..

అవును.. ఆనందయ్య ఉంటున్న గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఇప్పుడు ఆనందయ్యను విలన్ గా చూస్తున్నారు. ఆయన ముందు పంపిణీ చేస్తానంటే వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా, ఎలాంటి లైసెన్సులు లేకుండా మందు ఎలా తయారుచేసి, పంపిణీ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి బలమైన కారణం ఉంది.

సెకెండ్ వేవ్ టైమ్ లో ఆనందయ్య మందు కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కరోనా రోగులు క్యూ కట్టారు. దీంతో స్థానికులు చాలామంది కరోనా బారిన పడ్డారు. అప్పటివరకు కరోనాకు దూరంగా ఉన్న చుట్టుపక్కల ఊళ్లన్నీ, రోగుల రాకతో కరోనా బారిన పడక తప్పలేదు. ఒకదశలో పోలీసులు రంగంలోకి దిగి రద్దీని నివారించినప్పటికీ.. కరోనాను ఊరిలోకి రాకుండా ఆపలేకపోయారు.

ఇప్పుడు మరోసారి అలాంటి ప్రమాదం తరుముకొస్తుందేమోనని గ్రామస్థులు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులతో పాటు, ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే తమ ఊరిలో చిన్నపిల్లలు అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నారని, ఇలాంటి టైమ్ లో మరోసారి ప్రజలంతా ఆనందయ్య ఇంటి ముందు గుమిగూడితే అది తమ గ్రామానికి మంచిది కాదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయాన్ని ఆనందయ్య ముందుంచారు.

మందు పంపిణీకి అనుమతి ఉందా అంటూ ఆనందయ్య ముందే పంచాయితీ పెట్టారు గ్రామస్థులు. మరోసారి పంపిణీ పేరిట ప్రజలందర్నీ ఊళ్లోకి రప్పించవద్దని కాస్త గట్టిగానే హెచ్చరించారు. ఈ మేరకు భారీ ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టారు. కొంతమందైతే ఏకంగా ఆనందయ్యను ఊరు విడిచి వెళ్లాలని డిమాండ్ చేయడం గమనార్హం. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి దేవుడిగా కనిపించిన ఆనందయ్య.. ఇప్పుడు తన సొంత ఊరి ప్రజలకు విలన్ గా కనిపిస్తున్నారు.